
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 10న జరగనున్న జనాగ్రహ సభకు భారీగా ఏర్పాట్లు
బహిరంగ సభను సక్సెస్ చేయడానికి కమలనాథుల కసరత్తు
ప్రతి మండలం నుంచి 800 మందిని, డివిజన్ నుంచి 300 మందిని తీసుకురావాలని పార్టీ సూచనలు
కేంద్రమంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు జనసమీకరణ బాధ్యతలు
సిఎం రేవంత్‌రెడ్డిపై వాగ్బాణాలు సంధించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ‘జన ఆగ్రహ సభ’ పేరిట ఈ నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభను బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రెండేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న బహిరంగ సభకు బిజెపి భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే జన ఆగ్రహ సభకు సుమారు పది లక్షల మందిని తీసుకుని వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి మండలానికి, డివిజన్ల నేతలకూ టార్గెట్లు పెట్టారు. ప్రతి మండలం నుంచి ఎనిమిది వందల మందిని, డివిజన్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని మండల, డివిజన్ నాయకులకు సూచనలు ఇచ్చారు.
కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా జనసమీకరణను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఇంకా రాష్ట్ర పార్టీ కార్యవర్గం కూడా అన్ని జిల్లాల ముఖ్య నేతలతో చర్చిస్తూ, రవాణా ఏర్పాట్లుకు సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభ ప్రచార బాధ్యతను పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డికి అప్పగించారు.
ప్రధాని ప్రసంగించేందుకు బుల్లెట్ పాయింట్లనూ తయారు చేసేందుకు మరో నిపుణుల బృందం సీరియస్‌గా పని చేస్తున్నది. ఏఐసిసి కనుసన్నల్లో చురుకైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సర్కార్‌పైనా ప్రధాని వాగ్భాణాలు సంధించేలా పాయింట్లనూ సిద్ధం చేస్తున్నారు. ఇటీవల లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండి’ కూటమి అడ్డుకోవడాన్నీ ప్రధాని మోడీ నిప్పులు చెరగనున్నారు. ఇంకా దేశాభివృద్ధి జరగకుండా అడుగడుగునా ఇండి కూటమి అడ్డుకోవడాన్ని వికాస్ ద్రోహిగా ప్రధాని మోడీ తూర్పారపట్టనున్నారు.
సీఎం మాటలు నమ్మకండి..
దేశాన్ని ఉత్తర, దక్షిణగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను నమ్మరాదని ప్రధాని మోడీ చెప్పేలా ప్రసంగం పాఠంలో పొందుపరిచారు. దేశాభివృద్ధి సమానంగా జరగాలని కోరుకుంటామే తప్ప దక్షిణ భాగం అభివృద్ధి జరగరాదని ఎందుకు కోరుకుంటామని, దక్షిణ భూభాగం కూడా భారత్‌లో భాగమే కదా? అని ప్రధాని చెప్పేలా ఒక వాక్యం సిద్ధం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఆదరించండి..
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిజెపిని కమలనాధులను ఆశీర్వదించాలని ప్రధాని పిలుపునివ్వనున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొననున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన పది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల గురించి వివరించనున్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర అభివృద్ధి పనుల గురించి ప్రధాని మోడీ ప్రసంగం పాఠంలో పొందుపరిచినట్లు సమాచారం.
కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం
జి. మనోహర్ రెడ్డి ఆశాభావం
ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై ప్రభావం ఉంటుందని బిజెపి సీనియర్ నాయకుడు, ప్రధాని మోడీ సభ ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న గంగిడి మనోహర్ రెడ్డి (మునుగోడు) శనివారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు కార్పొరేషన్లలోని మూడు వందల సీట్లలో ఇప్పటికే తమ పార్టీ 250 సీట్లలో బలంగా ఉందని ఆయన తెలిపారు. ప్రధాని బహిరంగ సభతో మూడు మేయర్ స్థానాలనూ తాము సునాయసంగా కైవసం చేసుకుంటామని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ పాల్గొనే బహిరంగ సభ విజయవంతం కావడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విస్తృతంగా జిల్లాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ముఖ్య నేతలతో, జిల్లా నేతలతో చర్చిస్తున్నారు.












