ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై మంత్రి సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు,

అలాగే ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపిహెచ్‌ఎ ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రెండేళ్లలో సుమారు 12,650 పోస్టులను భర్తీ చేశామని, మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయితే.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.