పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఆధిక్యం వస్తుందని వెల్లడైన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ అంచనాలను పూర్తిగా తిరస్కరిస్తూ, తమ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 226కి పైగా స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు వీడియో సందేశం ద్వారా మమతా కీలక సూచనలు చేశారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, సీనియర్ నాయకులు స్వయంగా కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరూ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమానంగా, అప్రమత్తంగా నిఘా పెట్టాలి. అవసరమైతే నేను కూడా నా భవానీపూర్ నియోజకవర్గంలో స్వయంగా కాపలా కాస్తాను అని మమతా తెలిపారు.


బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆమె రాజకీయ కుట్రగా అభివర్ణించారు. టీఎంసీ కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగించేందుకే ఇలాంటి అంచనాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మేము 226కి పైగా సీట్లు గెలవబోతున్నామని వారికి తెలుసు. టీఎంసీ జోరును అడ్డుకోవడం బీజేపీ వల్ల కాదని వారికి స్పష్టంగా అర్థమైంది అని మమత వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాయాలని ఆమె ఆదేశించారు. పగటిపూట కార్యకర్తలు విధుల్లో ఉండాలి. రాత్రివేళల్లో నాయకులే స్వయంగా పర్యవేక్షణ చేపట్టాలి. నేను కాపలా కాస్తే, మీరు కూడా కాయగలరు. రాత్రంతా మేల్కొని ఉండండి. ఉదయం తదుపరి బృందానికి బాధ్యతలు అప్పగించిన తర్వాతే విశ్రాంతి తీసుకోండి అని ఆమె సూచించారు.

2021 ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ, తుది ఫలితాల్లో అవి తప్పాయని మమత గుర్తుచేశారు. 2016లో కూడా ఇదే జరిగింది. 2021లో కూడా అదే పునరావృతమైంది. ప్రతిసారి బీజేపీకి అనుకూలంగా చూపించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు పూర్తిగా భిన్నంగా నిలిచాయి అని ఆమె పేర్కొన్నారు. మమతా బెనర్జీ మీడియా కథనాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల లెక్కింపుకు ముందే ప్రజల్లో ఒక నిర్దిష్ట అభిప్రాయం కల్పించేందుకు మీడియా ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ టెలివిజన్ ఛానళ్లకు ప్రత్యేక సందేశాలు పంపిందని, ఎగ్జిట్ పోల్స్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని తమకు నిఘా సమాచారం వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని అడ్డుకోలేమని బీజేపీకి స్పష్టంగా తెలుసు. అందుకే ఈ మీడియా ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు అని మమతా విమర్శించారు.

ఈవీఎంల భద్రతపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాళ్లకు ఈవీఎంలను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ కార్యకర్తలకు సూచించారు. ఈ కీలక సమయంలో ఈవీఎంలను మార్చే కుట్రను వారు పన్నుతున్నారు అని మమత ఆరోపించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులను ఎదుర్కొంటూ టీఎంసీ కార్యకర్తలు ప్రాణాల మీదకు తెచ్చుకుని పోరాటం చేశారని ఆమె ప్రశంసించారు. కొన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన మమత, దీదీపై విశ్వాసం ఉంచండి. బెంగాల్ ప్రజలపై నమ్మకం పెట్టుకోండి. ‘మా, మట్టి, మనుష్’ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీకి 148 సీట్లు అవసరం కాగా, చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం చూపించాయి. అయితే పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్, జనమత్ అనే రెండు సర్వే సంస్థలు మాత్రం టీఎంసీకి స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని తెలిపాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం టీఎంసీకి 177-187 సీట్లు, బీజేపీకి 95-110 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్‌కు 0-1 సీటు, కాంగ్రెస్‌కు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనమత్ సర్వే ప్రకారం టీఎంసీకి 195-205 సీట్లు, బీజేపీ కూటమికి 80-90 సీట్లు, కాంగ్రెస్‌కు 1-3 సీట్లు లభించవచ్చని అంచనా వేసింది. అయితే మిగతా ఎక్కువ సర్వేలు బీజేపీకి ఆధిక్యం ఉంటుందని పేర్కొన్నాయి.

మ్యాట్రిజ్ సర్వే బీజేపీకి 146-161 సీట్లు, టీఎంసీకి 125-140 సీట్లు వస్తాయని తెలిపింది. పీ-మార్క్ సర్వే ప్రకారం బీజేపీకి 150-175 సీట్లు, టీఎంసీకి 118-138 సీట్లు రావచ్చని అంచనా వేసింది. పోల్ డైరీ సర్వే బీజేపీకి 142-171 సీట్లు, టీఎంసీకి 99-127 సీట్లు, కాంగ్రెస్‌కు 3-5 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రజా పోల్ సర్వే అయితే బీజేపీకి అత్యధికంగా 178-208 సీట్లు వచ్చే అవకాశం ఉందని, టీఎంసీకి 85-110 సీట్లు మాత్రమే లభించవచ్చని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. తొలి దశలో 93.19 శాతం, రెండో దశలో 92.67 శాతం ఓటింగ్ నమోదైంది. స్వాతంత్య్రం తర్వాత ఇవే అత్యధిక పోలింగ్ శాతాలుగా అధికారులు పేర్కొన్నారు.