మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమ లు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని సబ్ కమి టీ నిర్ణయించింది. ప్రజాభవన్‌లో మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై  కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మూసీ డిపిఆర్‌ను అధికారులు మంత్రులకు సమర్పించారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం దాదాపు రూ.7,055 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల సేకరణకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నివాస గృహాలు లేదా ఇతర నిర్మాణాలపై ప్రభావం పడకుండా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఎటువంటి నిర్మాణాలకు ఆటంకం కలగని విధంగా ఉన్న ప్రాంతంలో మొదటి 5 కిలోమీటర్ల మేర పనులను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.

ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలి

ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, వర్షాల వల్ల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు మంత్రులు సూచించారు. సమావేశానికి ముందు మంత్రుల బృందం మూసీ నదిపై ఏర్పాటు చేయబోయే రబ్బర్ డ్యామ్ నమూనాలను పరిశీలించారు. నదిలో నీటి మట్టాన్ని నియంత్రించడానికి, సుందరీకరణకు ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. తొలి దశ పనులు వేగవంతం చేయడం ద్వారా హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చాలని మంత్రులు అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్టు వివరాలను బస్టాండ్లు, ప్రధాన రోడ్లు, థియేటర్లలో ప్రచార వీడియోలు ప్రదర్శించాలని మంత్రులు సూచించారు. 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలని అదే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రులు ఆదేశించారు. డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు నిర్ధేశించారు.

55 కిలోమీటర్లు 5 దశల్లో అభివృద్ధి

మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 55 కిలోమీటర్ల మేర 5 దశల్లో అభివృద్ధి చేపట్టనున్నారు. ఫేజ్-1కు 7,055 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి) నిధుల కోసం సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తయ్యాయి. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నదిలోని చెత్తను తొలగించి, రివర్ బెడ్ ప్రొఫైలింగ్‌ను చేపట్టనున్నారు. వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు. మూసీ రెండు వైపులా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, నీటి నిల్వ కోసం బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక పర్యవేక్షణకు ఐఐటీ, జేఎన్‌టీయూల సహకారం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.