పిల్లలు లేని ఆడపడుచు కళ్ళల్లో ఆనందం కోసం ఆరు నెలల పాపను మహిళ కిడ్నాప్  చేసింది. ఈ ఘటన సూరారం పోలీస్టేషన్ పరిధిలో  ఈ నెల 4న చోటుచేసుకుంది. 48 గంటల్లో కిడ్నాప్ కేసును సూరారం  పోలీసులు చేదించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీదేవి మైలార్దేవ్ పల్లి ప్రాంతంలో నివాసం ఉంటుంది. తన ఆడపడుచుకి పిల్లలు లేరని బాధపడుతుండడం చూసి ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలని నిర్ణయించుకుంది.  ఎలాగైనా ఆమెకి ఒక పాపని ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలో  శ్రీదేవి అనే  తనతో పాటు క్యాటరింగ్ లో పనిచేసే మరో నలుగురితో కలిసి ఆరు నెలల పాపను కిడ్నాప్ చేశారు.

మే 4వ తేదీన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న తల్లిదండ్రుల వద్ద నుంచి ఆరు నెలల పాపను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ  ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను  పోలీసులు అరెస్టు చేశారు. శ్రీదేవి తో పాటు ఆమెకు సహకరించిన కార్తీక్.. జాన్సన్ మరో ఇద్దరు మైనర్లను  సూరారం పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉంటూ శ్రీదేవి పనిచేసే క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు.