
టిజిఎస్‌ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించే వరకు, సమ్మె జరిగినన్ని రోజులు తమ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలో గురువారం పర్యటించిన కిషన్‌రెడ్డి ఆయా ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, వీటిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు,
వాటర్ ఫిల్టర్లు వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల హామీల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఉపక్రమించి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.



