
మే 17లోగా డిపోల్లో వసతులు మెరుగుపరచాలి
ఆర్‌టిసి ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు కిందిస్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో, స్నేహపూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం ఆర్‌టిసి ఉన్నతాధికారులతో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, ఈడీలు, ఆర్‌ఎంలు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్‌టిసి కార్మిక సంఘాల నేతల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ స్థాయి అధికారులు సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని సూచించారు. ‘ఇంటర్నల్ ఎటాక్‘ సంస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సిబ్బందితో వాగ్వాదాలకు దిగడం సరికాదని పేర్కొన్నారు
17లోగా డిపోల్లో వసతులు మెరుగుపరచాలి
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఈ నెల 17 లోగా ప్రతి డిపో, బస్ స్టేషన్‌లలో పాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని డిపో మేనేజర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. డిపోలు, బస్ స్టేషన్లలో ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆర్‌టిసి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. 2023 డిసెంబర్ 9 నుండి మహాలక్ష్మి పథకం అమలవుతున్న నేపథ్యంలో ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు వంటి డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లు సమీక్షించుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.
డిపోల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
ప్రతి రెండవ మంగళవారం అన్ని డిపోల్లో ఆర్‌టిసి సిబ్బంది సమస్యలు వినడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది ఆరోజు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ప్రజా సంబంధాలు మెరుగుపరచాలని కోరారు. డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల వరకు ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు కొనసాగించాలని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను ఎండీ స్థాయికి తీసుకురావాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న షాపులను జూన్ వరకు క్లియర్ చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దామన్నారు. ఆర్‌టిసి సమ్మెలో కార్మికులు డిమాండ్ చేసిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దామని మంత్రి పొన్నం అన్నారు. డిపో మేనేజర్లు, ఆర్‌టిసి సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన కోరారు.
జూన్ నెలాఖరులోగా పెండింగ్ అంశాల పరిష్కారం: ఎండీ నాగిరెడ్డి
ఆర్‌టిసి ఎండి వై. నాగిరెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ జూన్ నెలాఖరులోగా బస్టాండులలోని కమర్షియల్ షాపులకు సంబంధించిన పెండింగ్ అంశాలను, ఇతర పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో సంస్థను మరింత లాభదాయకంగా, సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాలోమన్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సిటిఎం శ్రీదేవితో పాటు వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.












