కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకుంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన సమాజం, కనీసం తలదాచుకోవడానికి నీడ ఇవ్వని అమానుష స్థితికి చేరుకుంది. ఒకవైపు భర్తను కోల్పోయిన వేదన, మరోవైపు కన్నబిడ్డలతో కలిసి ఉండటానికి ఇల్లు లేని దుస్థితిలో ఒక అభాగ్యురాలు స్మశానవాటికనే ఆశ్రయంగా మార్చుకుంది.​ కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని గాంధీనగర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య రూప, ఇద్దరు చిన్నారులు దక్షత, శేహరికలతో కలిసి అద్దె ఇంట్లో నివసించేవాడు. శ్రీకాంత్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో, మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రూపకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది.

శ్రీకాంత్ మరణించిన తర్వాత ఇంటి యజమాని దయ లేకుండా అత్యంత దారుణంగా వ్యవహరించాడు. 12 రోజుల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ కఠినమైన నిబంధన పెట్టి గెంటేశాడు. ఉండటానికి వేరే దారి లేక ఆ తల్లి తన ఇద్దరు పసిబిడ్డలను పట్టుకుని రోడ్డున పడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ అభాగ్యురాలు, చివరకు తన భర్త అంత్యక్రియలు జరిగిన కరీంనగర్ లోని పద్మనగర్ స్మశానవాటికకే చేరుకుంది. చుట్టూ సమాధులు, నిశ్శబ్దం మధ్య ఆ భయంకరమైన ప్రదేశంలోనే తన బిడ్డలతో గడుపుతోంది. పగలు ఎండకు ఎండుతూ, రాత్రి వేళల్లో భయంతో వణికిపోతూ ఆ చిన్నారి బిడ్డలు తన తల్లి ఒడిలో తలదాచుకుంటున్నారు.​భర్తను కాల్చిన చితి ఇంకా చల్లారకముందే, అదే ఆవరణలో వారు జీవనం సాగించడం అక్కడి వారిని కన్నీరు పెట్టిస్తోంది.