
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇత ర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మనంద రం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని కోరారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌజ్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సుల ప్రారంభోత్సవం లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలు త మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జా ఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టిజిఎంఆర్‌ఇఐఎస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టిజిఎంఎఫ్‌సి చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం హౌజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని అన్నారు. దీంతో హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. అలాగే సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నామని తెలిపారు. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్షిప్ లు అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామని అన్నారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, ప్రతీ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుందని గుర్తు చేశారు.
బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువ
వైట్ కాలర్ జాబ్స్ కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో చాలామంది మైనారిటీ సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. దీంతో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. సంక్షేమం అభివృద్ధిలో మైనారిటీల వాటా వారికి అందిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ముఖ్యమంత్రి అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. తమకు హిందూ ముస్లిం భేదాభిప్రాయం లేదని స్పష్టం చేశారు.














