
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ నాలుగు విజయాలను అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సారథ్యంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.బ్యాట్‌తోనే కాకుండా తన అద్భుత కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే.
ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తూ అభిషేక్ ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో బ్యాట్‌తో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధిచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. బంతితోనూ రాణిస్తూ కీలక సమయంలో వికెట్లను పడగొడుతున్నాడు.
యువ ఫాస్ట్ బౌలర్ సకిబ్ హుస్సేన్ కూడా అసాధారణ బౌలింగ్‌తో అలరిస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేడయమే కాకుండా కీలక వికెట్లను తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రఫుల్ హింగె కూడా తన వంతు పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలంక సంచలనం ఇషాన్ మలింగ కూడా అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోతున్నాడు. కీలక సమయాల్లో వరుస వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు. జట్టు విజయాల్లో క్లాసెన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో హైదరాబాద్ వరుస విజయాలను నమోదు చేస్తోంది.



