
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి
తిరుమలేశుని దర్శించుకున్న బిజెపి చీఫ్ రాంచంద్రరావు
మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తెలిపారు. రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరిపైనా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని వచ్చిన రాంచందర్‌రావుకి శంషాబాద్ విమానాశ్రయంలో సాయంత్రం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.








