ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన అక్క ఖాతాలోని రూ.20,000 బ్యాంకు నుంచి డ్రా చేసుకునేందుకు ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మండుటెండలో మూడు కిలోమీటర్లు బ్యాంకుకు నడిచాడు. అంతకుముందు ఎప్పుడో సమాధిలో ఖననం చేసిన తన సోదరి అస్థిపంజరాన్ని స్వయంగా తవ్వి బయటకు తీశాడు. ఈ ఘటన దియానాలి గ్రామంలో చోటుచేసుకుంది. జితు ముండా అనే వ్యక్తి సోదరి కాక్రాకు మల్లిపాసిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖాతా ఉంది. కాక్రా రెండు నెలల క్రితం చనిపోయింది. ఆమె భర్త, సంతానం అంతకు ముందే మరణించారు. కాక్రాకు కుటుంబ సభ్యుడిగా మిగిలింది జితు మాత్రమే. దీంతో తన సోదరి ఖాతాలో మిగిలిన రూ.20,000 విత్‌డ్రా చేసుకోవడానికి జితు బ్యాంకుకు వెళ్లాడు. అయితే డబ్బు తీసుకోవాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా మరణ ధ్రువీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ సమర్పించాలని చెప్పి,

డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు. దీంతో సోమవారం నాడు శ్మశానవాటికకు వెళ్లిన జితు తన సోదరి అవశేషాలను బయటకు తీశాడు. అస్థిపంజరాన్ని గుడ్డలో చుట్టి బ్యాంకుకు తీసుకెళ్లాడు. జితు చేతిలోని అస్థిపంజరాన్ని చూసిన బ్యాంకు అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి చనిపోయిందని, తీసుకురాలేనని బ్యాంకు అధికారులకు పదేపదే చెప్పినా పెడచెవిన పెట్టారని, తప్పనిసరి పరిస్థితుల్లో కోపంతో వెళ్లి సమాధి తవ్వి తన సోదరి అస్థిపంజరాన్నే మోసుకు వచ్చానని జితు చెప్పాడు. ఆమె చనిపోయిదనడానికి సాక్షంగా తీసుకొచ్చానని వివరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి డబ్బు జితుకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. తాము చనిపోయిన వ్యక్తిని భౌతికంగా తీసుకురావాలని చెప్పలేదని బ్యాంకు అధికారులు వివరణ ఇచ్చారు.