మూడు రోజుల పాటు తీవ్రమయిన వడ గాలులు

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు మిశ్రమ వాతావరణం

ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం

అయినా పెరగనున్న ఉష్ణోగ్రతలు

వెల్లడించిన వాతావరణ శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి మహోగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం నుంచే తీవ్రమయిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం, మధ్యాహ్న సమయంలో విపరీతంగా వడగాల్పులు వీస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు తీవ్రమయిన వడగాలులు ఉంటాయని తెలంగాణ వెథర్‌మ్యాన్ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 27 నుంచి దక్షిణ తెలంగాణలో ఉరుములతో వర్షాలు, ఏప్రిల్ 30 వరకు వడగాలులు ఉంటాయని తెలిపారు.

కాగా, ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయని, ఆదివారం ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హైదరాబాద్‌లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని, వచ్చే మూడు రోజులు వడగాలులు మరింత ఉధృతంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఆరంజ్ అలర్ట్, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.

కాగా, రాష్ట్రంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 44.3, కామారెడ్డి జిల్లా మెన్నూర్, మంచిర్యాల జిల్లా జనకాపుర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, పెద్దపల్లి జిల్లా కామ్నాపూర్‌లో 44.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చప్రాల, నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 44.1 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం

కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో రాగల నాలుగు రోజులు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.