అమెరికాలో ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది లో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే కర్నూలుకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు అమెరికా, షికాగోలోని డీపాల్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయ త్నాలు చేస్తున్నాడు. అయితే, అమెరికాలో మారిన పరిస్థితుల కారణంగా ఉద్యోగం రావటం కష్టతరంగా మారింది. అవసరాల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవటం.. ఖర్చుల కోసం కుటుంబసభ్యుల మీద ఆధారపడాల్సి రావటం తో చందు తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28వ తేదీన అపార్ట్‌మెంట్ గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణా లు తీసుకున్నాడు. చందు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకుపైనే ఆశలన్నీ

చందు తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు చందుని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుతోందన్న ఆవేదనతోనే చందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనపై అమెరికాలోని తెలుగు సంఘాలు స్పందించాయి. చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై స్పందించారు.‘ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.

మృతదేహాన్ని క్షేమంగా, వేగంగా భారత్‌కు తరలించేలా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం‘ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఎంబసి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. చందు మరణంపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా అర్ధాంత రంగా తనువు చాలించడం తెలుగు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థులు ధైర్యంగా ఉండా లని, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు.