
మాయమాటలు చెప్పి సోదరిని పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం
మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ చెల్లికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని ఆగ్రహంతో బావపై బావమర్ధులు దాడి చేసిన సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వట్టేపల్లికి చెందిన ఆయెషా ఫాతిమా(28) అనే యువతి రెండేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సల్మాన్‌కు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అతడిని ఫాతిమా వివాహం చేసుకోవడం ఆమె సోదరులు సమద్, ఇంతియాజ్, సర్ఫరాజ్ కు ఇష్టం లేదు. ఆయెషా ఫాతిమాకు తమ బంధువైన ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని భావించారు. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో సోదరులు చెల్లి ఆయెషా ఫాతిమాపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయేషా ఫాతిమా గురువారం బండ్లగూడలోని ఓ ఆస్పత్రిలో కుమారుడికి జన్మనిచ్చింది. డెలివరీ అయిన సోదరిని చూడటానికి ఆస్పత్రికి ముగ్గురు సోదరులు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బావ సల్మాన్‌తో గొడవ పడ్డారు. తన సోదరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావని అతనిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన సోదరిపై కూడా చేయి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.











