మొత్తం 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దఫా 152 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే డార్జిలింగ్ నియోజకవర్గంతోపాటు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మిడ్నపూర్ నియోజకవర్గాలు కూడా మొదటి దఫా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. తొమ్మిది జిల్లాల్లోని ఏడు జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దులో భాగంగా ఉంటున్నాయి. అవి ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, కూచ్ బీహార్, జలపాయ్‌గురి, డార్జిలింగ్ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. అంచనాలకు విరుద్ధంగా స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత గత 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి కన్నా ఇప్పుడు బలంగానే కనిపిస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో అది ప్రాధాన్యమైన అంశం కాదు. ఇప్పుడు ఓటర్ల దృష్టి సన్నిహితం, వ్యక్తిగతంపైనే కేంద్రీకరించబడింది.

ఓటర్ల జాబితాల్లోంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను పాత నిబంధనలను పక్కన పెట్టి కొత్త నిబంధనలతో ఎన్నికల కమిషన్ తొలగించడం, వారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును లేకుండా చేయడంపైనే ఓటర్లు చాలా తీవ్రంగా ఉన్నారు. ఏరోజుకారోజు కొత్త నిబంధనలను రూపొందించి అమలు చేయడం, ఆటంకాలు ఇవన్నీ ఆయా సంస్థలకు అసాధారణమనిపిస్తోంది. బిజెపి ఉన్నతాధికారం, అక్రమ వలసదారులకు, కపట ఓటర్లకు వ్యతిరేకంగా బిజెపి సాగించిన భారీ ప్రచారం ప్రభావం ఎంతవరకు ఈ ఎన్నికల్లో పనిచేస్తుందో అంచనా వేయడం కష్టం. టిఎంసి, దాని పాలిత వర్గాల నాయకులు ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని మద్దతు కల్పించారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తెస్తామని బిజెపి స్పష్టం చేసింది.

అయితే ఈ పరిణామం ఓటర్లపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశం ఓటరను విభజించి, ఉద్రిక్తతలు స్పష్టంగా తెలిసేలా చేసినట్టు అనిపించడం లేదు. ఉద్రిక్తత మాత్రం కనిపిస్తోంది. 31 లక్షల ఓటర్ల భవిష్యత్తు ఎటూ తేలక పెండింగ్‌లో పడడం ఓటర్లను కుంగదీస్తోంది. వీరికి పూర్తి న్యాయం చేకూర్చాలన్న నిశ్చయంతో రాజ్యాంగం లోని 142 ఆర్టికల్ ఉపయోగించి అసాధారణ అధికారాలతో ఈ నెల 21 నాటికి వీరి వివాదాలు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పాల్గొన లేకుండా 34 లక్షల మంది ఓటర్లను మినహాయించడం, తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి వారి ఓటుహక్కు లేకుండా చేయడం అన్యాయమే అని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 6.44 కోట్ల ఓటర్లు ఓటువేయడానికి అర్హులైనప్పుడు, 34 లక్షలు అన్నది పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ ఈ చెప్పుకోతగిన సంఖ్యలో ఉన్న ఓటర్ల భావోద్వేగాలు మమతా బెనర్జీకి లాభదాయకమవుతాయి. వీరి భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ప్రధాన అంశం అవుతుంది.

ప్రజాస్వామ్యాల సాధారణ నియమాల ప్రకారం ప్రభుత్వాలు మారడం అత్యంత సహజం. అదేం వినాశనకరమైన లేదా అత్యంత భయంకరమైన పరిణామం ఏదీ కాదు. గత ఐదేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం మారాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తొలగించాలని, ఢిల్లీ నియంత్రణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలన్న అభిప్రాయం తొంగిచూస్తోంది. ఈ తరుణం లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందా? కాంగ్రెస్ తిరిగి అవతరిస్తుందా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 91 లక్షల మంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి ఎన్నికల కమిషన్ గందరగోళం సృష్టించడం హిందూ మద్దతుదారులకు, బిజెపి వర్గాలకు తప్ప మిగతా వారికి నచ్చడం లేదు. ఈ విధంగా తొలగించడంలో తప్పేమీ లేదని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నా మరే ప్రభుత్వం ఉన్నా ఇదే పనిచేస్తుందని బిజెపి వర్గాలు సమర్థించుకుంటున్నాయి.

కానీ గత ఆరునెలలుగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ఎన్నికల కమిషన్ ఓటర్లను బాధపెడుతుండడం బెంగాల్‌లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కూలీనాలీ చేసుకునే గిగ్ వర్కర్లు తమ పనులు కోల్పోయి ఎన్నికల కమిషన్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇది ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని బిజెపి వర్గాలకు నష్టదాయకమనే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో అగ్నిపరీక్ష వంటివి. బిజెపిని ఓడించడం తనకే సాధ్యమని ధీమా పడుతున్న బెనర్జీకి ఇండియా కూటమి లోని పార్టీల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కూడా పెరుగుతోంది. ప్రభుత్వంలో అవినీతి హద్దులు దాటిందన్న అపకీర్తి వెంటాడుతోంది. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య రాజకీయ పరిస్థితులు, ఇతర పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది.

గత ఐదేళ్లలో ఎన్నో ఉత్కంఠభరితమైన సంచలనాత్మక సంఘటనలు జరిగాయి. మహిళలపై హింసాత్మక, హత్య, అత్యాచార సంఘనలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ నిర్వహణ లోని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, ఆపై హత్యాకాండ ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మమత ప్రభుత్వానికి ఇది తీరని కళంకంగా మారింది. 2025 డిసెంబర్ 13న క్రీడాకారుడు లియోసివ్ మెస్సీ కోల్‌కతా పర్యటన సమయంలో నిర్వహణ లోపంతో అల్లర్లు, గందరగోళం చెలరేగాయి. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన పశ్చిమబెంగాల్ సాంస్కృతిక వారసత్వ వేడుక దుర్గాపూజ నిర్వహణకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందన్న ఆరోపణలు బిజెపి చేసింది. ఇవన్నీ మమత ప్రభుత్వానికి కళంకాలని చెప్పవచ్చు. ఈ తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.