
ఒకప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ పేరు వింటే చాలు, సగటు మనిషి ఛాతీ గర్వంతో మరో రెండు అంగుళాలు విశాలమయ్యేది. అవినీతిని అంతమొందించడంలో, ప్రజారంజకమైన పాలన అందించడంలో ఆ పార్టీ ముందుంటుందన్న ధైర్యం వారిలో అడుగడుగునా కనబడేది. కానీ, పద్నాలుగేళ్లు తిరిగేసరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవినీతి కూపంలో నిండా మునిగిపోయి, ఊపిరాడక సతమతమవుతున్న ఆ పార్టీ సగటు మనిషికి ఏనాడో దూరమైంది. ఈ పరిస్ధితికి కొంతవరకూ ఆ పార్టీ అధినేత కారణం కాగా, మరికొంత కేంద్రంలో చక్రం తిప్పుతున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కారణం. ఈ మిత్రద్వయం తరచూ వేస్తున్న ఎత్తుగడలకు చిత్తవడం కేజ్రీ వంతవుతోంది. మద్యం కుంభకోణం కేసులు బనాయించి, ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయించి, ఆ కేసుల ఆధారంగా పార్టీ పెద్దలపై అవినీతి ముద్ర వేసి, ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ కమలనాథులు అంతటితో ఆగలేదు. రాజ్యసభ సభ్యులైన ఏడుగురు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలను తమవైపు తిప్పుకుని, బిజెపిలో విలీనం చేసుకోవడం తాజా పరిణామం.
దీంతో ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో రాబోయే పంజాబ్ ఎన్నికల్లో గెలుపు తమదేనని సంతోషిస్తున్న కేజ్రీవాల్‌కు ఆ సంబరం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. నిన్నటివరకూ తనకు, పార్టీకి కుడిభుజంలా నిలబడినవారు సైతం అకస్మాత్తుగా ఇలా ‘ఫిరాయించడం’తో కేజ్రీ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆమ్‌ఆద్మీ పార్టీ పెట్టకముందునుంచీ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితులుగా మెలగిన రాఘవ్ చద్దా, స్వాతి మలీవాల్ వంటివారు సైతం బిజెపి గూటికి చేరిపోవడం వింతల్లోకెల్లా వింత. రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడం, రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పాగా వేయడం లక్ష్యంగా మోడీ, షా ద్వయం తాజా వ్యూహానికి తెర తీశారన్నది విస్పష్టం. ఆప్ ఎంపిల చేరికతో రాజ్యసభలో బిజెపి సభ్యుల బలం 113కి చేరగా, ఎన్‌డిఎ బలం 146కు పెరిగింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) లో లొసుగులను ఆసరా చేసుకుని ఇలా ఇతర పార్టీల సభ్యులకు ఎర వేసినందుకు మోడీ, అమిత్ షాలను తప్పుబట్టడంలో తప్పేమీ లేదు. అయితే, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ, పదేళ్లపాటు ఢిల్లీని పాలించి చాలినంత రాజకీయ, పాలనా అనుభవం గడించి కూడా.. ప్రత్యర్థుల ఎత్తుగడలను చివరిదాకా పసిగట్టలేకపోయినందుకు కేజ్రీవాల్‌నూ అంతే తప్పుపట్టాలి. ప్రాంతీయ పార్టీల పొడ అసలే గిట్టని భారతీయ జనతా పార్టీ పెద్దలు, వాటి ఊపిరి తీసేందుకు ఎంతకైనా తెగిస్తారనేది గత చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. దేశ రాజధానిలో తిష్ఠవేసుకుని కూర్చుని, తమకు పక్కలో బల్లెంలా మారిన ఆప్‌ను అంతమొందించాలన్నది మోడీ, అమిత్ షాల చిరకాల వాంఛ. అందులో చాలావరకూ కృతకృత్యులయ్యారన్నది ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతోనే రుజువైంది.
ఇక పంజాబ్ లోనూ ఆప్‌ను అధికారంనుంచి దింపడమే లక్ష్యంగా కేజ్రీవాల్ ఆరోపించినట్లు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారు. మునుపటి ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ విజ యం వెనుక కీలకపాత్ర పోషించిన రాఘవ్ చద్దాకు గాలం వేయడం అందులో భాగమే. అగ్నికి ఆజ్యం తోడైనట్లు, బిజెపి నేతల ఎత్తుగడలకు కేజ్రీవాల్ స్వయంకృతాపరాధాలు తోడయ్యాయి. అవినీతిని అంతం చేస్తానని నమ్మబలికిన ఆప్ అదే అవినీతికి ఆలవాలమైందన్న బిజెపి పెద్దల ఆరోపణలకు కేజ్రీవాల్ ఇంద్రభవనాన్ని తలదన్నుతూ కట్టుకున్న ఇల్లు, మద్యం కుంభకోణం వంటివి బలం చేకూర్చాయి. ఇప్పటికైనా మించింది లేదు. తమ పార్టీ నేతలు మరికొందరు చేజారకముందే ఆప్ అధినేత జాగ్రత్తపడటం మంచిది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ ఎన్నికల్లో బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టేలా పదునైన వ్యూహాలను రచించగలగాలి.
గత కొన్నేళ్లుగా పంజాబ్ లో పలువురు ఆప్ నాయకులను బిజెపి నయానో భయానో తమవైపు తిప్పుకోగలిగింది. ఈ తెలివిడి, రాజకీయ చతురత లేకనే ఆప్ అగ్రనేతలు ప్రత్యర్థులు పన్నిన ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఒకవైపు పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ, మరోవైపు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేసేలా రాజకీయ వ్యూహరచన చేయగలిగితేనే పంజాబ్‌లో ఆప్ అధికారాన్ని నిలుపుకునేది. మద్యం కుంభకోణ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును, తాజాగా తమ పార్టీ ఎంపిల విలీనం ఉదంతాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకువెళ్లగలగాలి. లేదంటే జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆమ్‌ఆద్మీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా పోయే పరిస్థితి దాపురిస్తుంది.












