
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బిసి మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. టైలరింగ్ తో ఉత్పాదకతను పెంచడంతో వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా పొన్నం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుందని స్పష్టం చేశారు. పథకం అమలుపై బిసి సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.










