ఛాయా చిత్రకళ అనేది కేవలం దృశ్యాలను బంధించే సాంకేతిక ప్రక్రియ కాదు. అది వెలుగు, నీడ, భావం, సమయం కలిసిన ఒక సమగ్ర కళ. ఒక ఫోటోలో పైకి కనిపించేది కేవలం దృశ్యం మాత్రమే అయినా, దానిలో దాగి ఉండేది ఒక కథ, ఒక అనుభూతి, ఒక ఆలోచన. ఛాయా చిత్రకళలో కళాత్మకత అనేది చూడగలిగే దృష్టిలో ఉంటుంది. ఒకే దృశ్యాన్ని అనేక మంది చూస్తారు. కానీ, దాన్ని అర్థవంతంగా చూపించగలిగే చూపు చాలా కొద్ది మందికే చెల్లు. ఫోటోలో వెలుగు నీడల సమతుల్యత, ఆ క్షణాన్ని పట్టుకునే సమయం, ఒక భావాన్ని వ్యక్తీకరించే ఫ్రేమ్ ఇవి అన్నీ కలిసినప్పుడు ఫోటో ఒక చిత్రంగా కాకుండా ఒక భావస్పోరకమయిన కవితగా, కళాఖండంగా మారుతుంది. వెయ్యి పదాలకంటే అధికంగా మాట్లాడుతుంది.

భారతదేశాన్ని ఫోటోలలో బంధించిన చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. కానీ భారతీయ సమాజాన్ని, ఆయా కాలాల్ని, అక్కడి అప్పటి మనుషుల అంతర్ముఖాన్ని ఒకే ఫ్రేమ్‌లో నిలిపినవారు చాలా కొద్దిమంది మాత్రమే. ఆ అరుదైన వారిలో ముఖ్యుడు రఘు రాయ్. ఆయన తన కెమేరాతో కేవలం చిత్రాలు మాత్రమే తీయలేదు. ఆయన కెమెరా కన్ను భారతానిని అర్థం చేసుకుంది, అనుభవించింది. మన కళ్ళ ముందు దృశ్యాలను సాక్షాత్కరింపజేసింది. ఒక ఫోటో పదాలు లేకుండా నే మాట్లాడుతుంది, బాధను చూపుతుంది, ఆనందాన్ని పంచుతుంది, సమాజాన్ని ప్రశ్నిస్తుంది. అందుకే రఘు రాయ్ తీసిన చిత్రాలు చరిత్రలా నిలిచిపోయాయి. అవి కేవలం కళ్లతో కాదు, మనసుతో చూడాల్సినవి. వాస్తవంగా చెప్పాలంటే ఫోటో అనేది కేవలం కెమెరాతో తీసేది కాదు. మనసుతో, మెదడుతో, చూపుతో నిర్మించేది అంటాడు రఘు రాయ్. అందుకే ఆయన ఫోటోలు చూసినప్పుడు అవి కేవలం దృశ్యాల్ని చూపవు, కథల్ని, వ్యధల్ని వినిపిస్తాయి.

1942లో ఇప్పటి పాకిస్తాన్‌లో జన్మించిన రఘు రాయ్ బాల్యం దేశ విభజన వేదనలతో నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయనలో ఒక ప్రత్యేకమైన సున్నితత్వాన్ని పెంచాయి. దేశ విభజన గాలుల్లో వీచిన భయానక దృశ్యాలు ఆ చిన్న బాలుడి మనసులో నిలిచిపోయాయి. ఆయన ఈ ప్రపంచాన్ని అట్లా చూస్తూ చాలా నేర్చుకున్నాడు మనిషి అంటే ఒక చిరునవ్వు కాదు, ఒక గాయం అని కూడా అర్థం చేసుకున్నాడు. ఆ బాలుడే తర్వాత కెమెరా పట్టినప్పుడు కెమెరా కేవలం యంత్రం కాలేదు. అది ఒక హృదయం అయ్యింది. తొలుత ఫోటోగ్రఫీ ఆయన ఎంచున్న వృత్తికాదు. రఘు రాయ్ అన్నయ్య ఎస్.పాల్ చూపించిన దారి అది, 1960లలో ది స్టేట్స్‌మన్ పత్రికలో పనిచేయడం ఆయన కెరీర్‌కు బలమైన పునాది వేసింది. ఆయన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ హెన్రి కార్టియర్ బ్రేస్సన్ ఆయనను 1977లో Magnum Photos లో సభ్యుడిగా ఆహ్వానించాడు. అది రాయ్ ప్రతిభకు అంతర్జాతీయ ముద్ర వేసింది. అంతేకాదు అది ఒక భారతీయ ఫోటోగ్రాఫర్‌కు లభించిన అరుదైన గౌరవం. హెన్రి కార్టియర్ బ్రేస్సన్ “రఘు రాయ్ చిత్రాలు తీసేవాడు కాదు వాటిని అనుభవించేవాడు” అంటాడు.

ఫోటో అనేది ఏదో ఒక క్షణాన్ని పట్టుకోవడం కాదు. ఆ క్షణాన్ని ఒక మనసులో నిలబెట్టడం, చూసేవాడి మనసు తడి తడి అయిపోవడం. అదే పని చేసిన వాడు రఘు రాయ్. ఆయన భారతీయ ఫోటోగ్రఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన వాడు. 1960లలో ‘ది స్టేట్స్ మన్’ పత్రికలో తన కెరీర్ ప్రారంభించిన రఘు రాయ్ కొద్ది సమయంలోనే తన ప్రత్యేక దృష్టితో, ప్రతిభతో గుర్తింపు పొందాడు. తర్వాత ఇండియా టుడే లో పిక్చర్ ఎడిటర్‌గా పనిచేసి భారతీయ విజువల్ జర్నలిజానికి కొత్త దిశ చూపించారు. ఆయన ఫోటోలు టైం, లైఫ్, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి. రఘు రాయ్ కెమెరా భారతదేశంలోని ముఖ్య చారిత్రక సంఘటనలను శాశ్వతంగా నిలిపింది. ముఖ్యంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన. 1984 డిసెంబర్ రాత్రి అక్కడ ఊహించని ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి పీల్చే గాలి విషమైంది. నిద్రలోనే వేల ప్రాణాలు నిశ్శబ్దంగా ఆగిపోయాయి. ప్రపంచమంతా ఆ దుర్ఘటనను చూశారు. కాని రఘు రాయ్ దాన్ని అర్థం చేసుకున్నాడు. రఘు రాయ్ తీసిన ఫోటోలు కేవలం బాధను చూపించలేదు.

బాధకు ఒక రూపాన్ని ఇచ్చాయి. ఒక ఫోటోలో మట్టిలో సగం పూడిపోయిన చిన్నారి ముఖం అది ఒక ఫోటో కాదు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అని ప్రపంచానికి వేసిన ప్రశ్న. ప్రపంచాన్ని నిలదీసిన క్షణం. ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు అవి కేవలం వార్తలు కాలేదు. అవి ప్రపంచాన్ని కదిలించాయి. రఘు రాయ్ కెమెరా భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక క్షణాలకు సాక్ష్యం గా నిలిచింది. రఘు రాయ్‌ను కేవలం ఫోటో జర్నలిస్టుగా పిలవడం సరయినది కాదు. ఆయన ఫోటోలు తరచూ కవిత్వంలా అనిపిస్తాయి. రఘు రాయ్ చిత్రాలు కవితల్లాంటివి, లోతైనవి, మనసును తాకేవి. ఆయన రచనలు, ఫోటో సిరీస్‌లు భారత ఆధ్యాత్మిక జీవితం, పట్టణాల మా ర్పు, పర్యావరణ సమస్యలు, సాధారణ మనుషుల గౌరవం లాంటి అనేక విషయాల్ని మన ముందుంచుతాయి. ఆయన ‘ఇండియా టు డే’ పత్రికలో పిక్చర్ ఎడిటర్‌గా పనిచేసి భారతీయ విజువల్ జర్నలిజాన్ని కొత్త దిశ వైపు నడిపించారు. ఫీచర్ స్పేస్ కోసం సంపాదక వర్గంతో ఆయన పోట్లాడేవాడని చెబుతారు.

రఘు రాయ్ అనేక ప్రసిద్ధ ఫోటో పుస్తకాలను ప్రచురించారు. అవి కేవలం ఫోటోల కూర్పు కాదు. భారతదేశానికి అర్థం చెప్పే విజువల్ గ్రంథాలు. ఆయనకు 1977లో భారత ప్రభుత్వం పద్మా శ్రీ, పురస్కారం ప్రదానం చేసింది. అంతేకాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా ఆయనకు లభించాయి. రఘు రాయ్ కేవలం ఫోటోలు తీసిన వ్యక్తి కాదు భారతదేశాన్ని ప్రపంచానికి చూపించిన సజీవ దృష్టి. ఇవ్వాల్టి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోటోలు తీస్తున్న ఈ రోజుల్లో, రఘు రాయ్ ‘చూడడం అంటే కేవలం చూడటం కాదు, అర్థం చేసుకోవడం’ అన్న ముఖ్యమైన విషయం మనకు గుర్తుచేస్తారు. అంతేకాదు భావోద్వేగం లేకుండా తీసిన పని ఖాళీగా ఉంటుంది అన్నారాయన.




 - వారాల ఆనంద్