
పూడికతీత పనులు చేపట్టి చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి
పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు
చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం
తక్షణమే ఎఫ్‌టిఎల్ లెవల్‌ను గుర్తించాలి
జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
చిన్న నీటిపారుదల చెరువులపై వ్యవసాయ శాఖ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రశంశనీయం -
ఇరిగేషన్ శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చెరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీత తో పునరుద్ధరించిన చెరువులు వచ్చే వర్షాకాలంలో జలాశయాలతో కళకళలాడేలాచూడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్ననీటి పారుదల చెరువులపై సీనియర్ కాంగ్రెస్ నేత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి ఆధ్వర్యంలో రూపొంచిన నివేదిక అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి పంపనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పూడికతీత పనులపై ఎర్రమంజిల్ కాలనీలోని నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పూడికతీత పనులు చేపట్టి చెరువులు పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన వివరించారు.
కమిటీల కోసం విధి, విధానాలు రూపొందించాలి
కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా విధి, విధానాలు రూపొందించాలని, అంతే గాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు ఆక్రమణలకు గురైతే తక్షణమే చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహారించాలని ఆయన సూచించారు. దాంతో పాటు ఎఫ్‌టిఎల్ లెవల్‌ను గుర్తించి సరిహద్దులు నిర్ణయించాలన్నారు. ఇందుకుగాను నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. పూడిక తీతకు ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున తక్షణమే వాటిని అమల్లోకి తీసుకొచ్చి పనులు ప్రారంభించాలన్నారు.
జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడిక తీత పనుల ప్రతిపాదనలను
సుమారు నెలన్నర క్రితమే ఈ పనులు చేపట్టాలని ఆదేశించినా ప్రతిపాదనలు రూపొందించడంలో ఎందుకు జాప్యం ఎందుకు జరిగిందని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిలదీశారు. చెరువుల స్థిరీకరణలో భాగంగా చెరువు కట్టలు, తూములు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ చేయలన్నారు. నీటిపారుదల శాఖ వద్ద ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా పూడిక తీత పనులతో పాటు చెరువు కట్టలను బలోపేతం చేస్తూ తూముల మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడిక తీత పనులకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే రూపొంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.












