
భారత భద్రతా, నిఘా సంస్థలకు కీలక విజయంగా భావిస్తున్న పరిణామంలో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు చెందిన ప్రముఖ సభ్యుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు అయిన సలీం దోలాను భారత్‌కు అప్పగించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇటీవల భారత, అంతర్జాతీయ నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సలీం దోలా పట్టుబడ్డాడు. అనంతరం ప్రత్యేక విమానంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఉదయం ఢిల్లీలోని టెక్నికల్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు.అధికారుల సమాచారం ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహించడంలో దోలా కీలక పాత్ర పోషించాడు. అతడు నడిపిన మాదకద్రవ్యాల సామ్రాజ్య విలువ రూ.5,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలోని డీ -కంపెనీకి చెందిన అంతర్జాతీయ డ్రగ్ పంపిణీ వ్యవస్థను ఛేదించే దిశగా ఈ అప్పగింత కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు.ఈ నెట్‌వర్క్ చాలాకాలంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ), ముంబై పోలీసుల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశ రాజధానికి చేరుకున్న వెంటనే సలీం దోలాను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో తీవ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు పెండింగ్ కేసుల దర్యాప్తు కోసం త్వరలోనే అతడిని ముంబై పోలీసులు లేదా ఎన్‌సీబీకి అప్పగించే అవకాశం ఉంది. ఇటీవల అతడి కీలక అనుచరులు పలువురు కూడా పట్టుబడిన నేపథ్యంలో, ఈ అప్పగింతను అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలపై భారత సంస్థలు సాధించిన భారీ విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.












