
పలు చోట్ల ధర్నాలు, నిరసనలు
దుబ్బాక ప్రజాపాలనలో మైకు నేలకేసి కొట్టిన ఎమ్మెల్యే
ఎర్ర జొన్న ఉద్యమంలా వరి ఉద్యమం..హెచ్చరించిన నిజామాబాద్ రైతులు
రాజన్న సిరిసిల్ల, హన్మకొండలో కొనసాగిన రైతుల ఆందోళనలు
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపొయిన ధాన్యం రాశులు
జిపిఎస్, ఆటోమెయిల్ ట్యాగ్ విధానంతో ధాన్యం తరలింపునకు చిక్కులు
ఉపసంహరించుకున్నా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
వర్షాల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తే వాటిని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పలు చోట్ల మొక్క జొన్న కొనుగోళ్లకు సైతం ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అనేక ప్రాంతాల్ల్లో రాజకీయ నాయకులతో కలిసి రైతులు ధర్నాలు, నిరసలు తెలియజేశారు.
రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్ంగలో మొక్క జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని నర్సంపేట మండలం మహేశ్వరంలో వరంగల్ ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 42 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేశామని నేడు ప్రభుత్వం మాత్రం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో మొక్కజొన్న దిగుబడి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు పట్ల సీత కన్ను వేసిందని, వెంటనే గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు పునరుద్దరించాలని ఆయన డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని, ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. దుబ్బాక ప్రజాపాలన కార్యక్రమంలో ధాన్యం కొనుగోళ్లపై ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా అధికారులు మైకు కట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మైకును నేలకేసి కొట్టి వడ్ల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని నేలపై కూర్చొని నిరసనకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ శివారులో ధాన్యం కొనుగోలు చేయాలని కల్లాల వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆలస్యంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లావు వడ్లతో సహా తరుగు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉండే ఎర్ర జొన్న ఉద్యమం మాదిరిగానే పెద్ద ఎత్తున వరి రైతులు ఉద్యమం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండంలంలోని నిజామాబాద్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎండలకు ధాన్యం తూకం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మక్కల కొనుగోలు కేంద్రాలను పెంచాలని మార్కెట్ ఎదుట వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులకు కలిసిన ధర్నా చేపట్టారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు, వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగటం లేదని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
రెక్కల కష్టాన్ని నమ్ముకొని పండించిన ధాన్యాన్ని అకాల వర్షం బారిన పడకుండా రైతులు కాపాడుకుని కొనుగోలు కేంద్రాలకు వద్దకు తీసుకొచ్చిన ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వం పెట్టిన అడ్డగోలు నిబంధనే కారణమని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడంలో కొత్తగా జిపిఎస్, ఆటోమెయిల్ ట్యాగ్ విధానం అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా కొనుగోలు కేంద్రంలో లోడు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలో ట్రక్కు షీట్ నమోదైన తర్వాతనే కేటాయించిన మిల్లు తెలుస్తుంది. దీంతో కొనుగోలు కేంద్రానికి మిల్లుకు మధ్య దూర పెరగడంతో లారీల కేటాయింపు కాంట్రాక్టరుకు సమస్యగా మారింది. దీంతో కాంట్రాక్టర్లు లారీలు పంపకపోవడంతో తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. దీంతో కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తింది. కొత్త విధానంతో కొనుగోలులో ఏర్పడిన జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జిపిఎస్, ఆటో మెయిల్ ట్యాగ్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే రవాణా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని ఉపసంహరించుకొంది. జిపిఎస్ విధానంతో పాటు ఆటో మెయిల్ ట్యాగ్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ధాన్యం రవాణా వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.














