ఇరాన్-అమెరికా మధ్య మరో దఫా చర్చలు ఇప్పటిలో కాకపోవచ్చు. చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య పురోగతి లభిస్తేనే కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభం సమసిపోదు. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత చర్యలు ఎదురవుతుండడంతో రెండో దఫా చర్చలపై ఇప్పటివరకు తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘ్రేయి సోమవారం స్పష్టం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించడం ముఖ్య అవసరం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ అమెరికా కూటమి యుద్ధం ప్రారంభించడం వల్ల ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయో అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ చమురు రవాణా స్తంభించింది. గ్రీక్, లైబీరియాకు చెందిన చమురు ట్యాంకర్లు వెనక్కు మరలాల్సి వచ్చింది.

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 119 డాలర్లకు తాకాయి. ప్రపంచవ్యాప్తగా చమురు సరఫరాకు ముప్పు వాటిల్లుతోంది. ఇంట్రాడేలో క్రూడాయిల్ ధరలు 8% వరకు పెరిగి సుమారు 97.81 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసింది. గత 50 రోజులుగా చమురు, గ్యాస్, గల్ఫ్ నుంచి దొంగచాటుగా హర్మూజ్ ద్వారా బయటకు పంపవలసి వస్తోంది. చమురు, గ్యాస్ ఉత్పత్తులను గల్ఫ్ దేశాలు తగ్గించుకున్నాయి. ఒక అంచనా ప్రకారం 50 బిలియన్ డాలర్ల విలువైన 500 మిలియన్ బ్యారెల్స్ చమురు అమెరికాకు ఒక నెల వరకు సరిపోతుంది. దీనికి తోడు ఎరువులు, అల్యూమినియం, హీలియం, సల్ఫర్ కొరత తీవ్రమైంది. ఫలితంగా దీని ప్రభావం రాగి, నికెల్ ఉత్పత్తిపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు 2 శాతం వరకు మాంద్యం ఎదుర్కోక తప్పదు. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ తరువాత గతవారం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సజావుగా ప్రారంభమై హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవడానికి వీలు కల్పించాయి. అయితే ఇరాన్‌తో పూర్తిగా ఒప్పందం కుదిరేవరకు అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని, ఇరాన్ నౌకలపై ఆంక్షలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది.

అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా ఒక్కరోజులోనే హార్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ మూసివేసింది. ట్రంప్‌కు అత్యంత అభిమానపాత్రుడైన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మున్నీర్ కూడా ఇరాన్ రేవులను అమెరికా ముట్టడించడమే రెండో దఫా చర్చలకు ప్రధాన అడ్డంకిగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనికి సాక్షంగా ఇరాన్‌ను రెచ్చగొట్టేలా ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా నావికాదళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేపట్టింది. ఇరాన్ వద్ద నష్టం కలిగించే గన్‌బోట్లు చాలా ఉన్నాయి. గత శనివారం నాడు భారత పతాకం కలిగిన రెండు నౌకలపై కూడా ఇరాన్ కాల్పులు జరపడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది. సైనిక చర్యలు లేదా ఒత్తిళ్ల వల్ల ఇంధన సరఫరా వెంటనే తిరిగి ప్రారంభం కాకపోవచ్చు. మరో నెల లేదా ఆరు నెలల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. కానీ ఏదేమైనా చర్చల ద్వారానే ఉద్రిక్తతలు సడలి సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని అందరి అభిప్రాయం.

కానీ ఇరాన్ బోట్ గన్ దాడులతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బుధవారం నాటికి కాల్పుల విరమణ గడువు ముగిసి చర్చలు పురోగతి సాధిస్తాయని అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతున్నా అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. చర్చల్లో ‘ఇరాన్ యురేనియం నిల్వలే’ ప్రధాన అడ్డంకిగా మారింది. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్‌లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధిచేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ ఆ ప్రకటనను తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్‌జడేహ్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద 450 కిలోల 60శాతం సుసంపన్న యురేనియం నిల్వలు ఉండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న సంగతి వాస్తవమే.

ఈ నిల్వలను 90 శాతం ఆయుధ స్థాయికి సులభంగా మార్చవచ్చని, తద్వారా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసి ప్రపంచ భద్రతను పణంగా పెట్టగలదనే భయం నెలకొంది. ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందనే అంచనాల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ అణు కేంద్రాలపై నిఘా ఉంచింది. శుక్రవారం ఇరాన్ వెనక్కి తగ్గితే అమెరికా కీలక పాత్ర వహిస్తుందా? అన్నదే ప్రశ్న. ప్రత్యర్థిని నిరంతరం అవమానించడం ఒప్పందాన్ని ఖరారు చేసే మార్గం ఎంతమాత్రం కాదు. ఇరాన్ యురేనియాన్ని పొందే ప్రయత్నంలో హర్మూజ్ జలసంధి ద్వారా ట్రాఫిక్ సాధారణ స్థితికి రావడం ముఖ్యం అన్న విషయం అమెరికా మరిచిపోకూడదు.

అంతవరకు గల్ఫ్ దేశాలు పాత రేట్లకు చమురును ఉత్పత్తి చేయలేవు. అల్యూమినియం, సర్ఫర్, తదితర అవసరాల నిల్వలు సమకూరవు. మే నెల మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. చైనా నుంచి తనకు ఘనస్వాగతం లభిస్తుందన్న భావనలో ట్రంప్ ఉన్నారు. వీరిద్దరి చర్చల్లో హర్మూజ్ జలసంధి ముట్టడి ప్రధాన అంశం కానున్నది. అలాగే ఇరాన్‌కు చైనా మిత్రదేశంగా ఉంటోంది. అందువల్ల హర్మూజ్ జలసంధి రవాణా సంక్షోభం పరిష్కారం అవుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి.