భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై ఎర్రజెండా ఒక చెరగని సంతకం. దానికో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే, వందేళ్ల ప్రస్థానం తర్వాత కూడా ‘అధికారం’ అనే గమ్యం ఎందుకు అగమ్యగోచరంగా మారింది? సిద్ధాంతం పటిష్టంగా ఉన్నా, ఆచరణలో ఎక్కడ అడుగులు తడబడ్డాయి? ప్రజల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవాలి. ‘ప్రజల నుండి... ప్రజల వైపుగా’ ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేవలం సిద్ధాంతాల చట్రంలో కాకుండా, భారతీయ మట్టి వాసనను, ఇక్కడి మనుషుల మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. ‘పుస్తకంలో ఉన్న సిద్ధాంతం కేవలం అక్షరం.. ప్రజల ఆకలిని తీర్చినప్పుడే అది అధికారం!’ ‘పుస్తకాల్లో ఉన్న మార్క్సిజం విజ్ఞానాన్ని ఇస్తుంది.. కానీ ప్రజల కళ్లలో ఉన్న కన్నీటిని తుడిచే మార్క్సిజం అధికారాన్ని ఇస్తుంది.’ కమ్యూనిజం అంటే కేవలం రష్యా, చైనా విప్లవాల చరిత్రకాదు. భారతదేశంలో ఎర్రజెండా గెలవాలంటే, అది ఇక్కడి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన అస్త్రం కావాలి. అణచివేత ఎక్కడ ఉన్నా అక్కడ ఎర్రజెండా ఉండాలి. అది ఆర్థిక దోపిడీ కావచ్చు లేదా వేలఏళ్లుగా పేరుకుపోయిన కులవివక్ష కావచ్చు.

మనువాద భావజాలం సృష్టించిన అగ్ర-నీచ భేదాలను తుడిచివేయడంలో ఎర్రజెండా మహాత్మా జ్యోతిరావు ఫూలే, - అంబేద్కర్ ఆశయాలను’ తన భుజానికెత్తుకోవాలి. భారతదేశం కేవలం ‘వర్గాల’ దేశం కాదు, ఇది ‘వర్ణాల’ దేశం కూడా. ఇక్కడి పేదరికం వెనుక కేవలం ఆర్థిక కారణాలే లేవు, శతాబ్దాల సామాజిక వివక్ష ఉంది. మార్క్సిజాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే చూడటం వల్ల, భారతీయ ఆత్మ అయిన ‘కులం’ అనే సంకెళ్లను తెంచడంలో ఎర్రజెండా కొంత వెనకబడింది. ‘మనువాదం నుంచి మనిషికి విముక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి శ్రమకు విముక్తి’ అనే రెండు కత్తులను ఎర్రజెండా ధరించాలి. అప్పుడే అది సామాన్యుడి ఆయుధమవుతుంది. ప్రజల నుండి కమ్యూనిస్టు నాయకులు పుట్టాలి. నాయకత్వం అనేది ఒక హోదాగా కాకుండా, ప్రజల కష్టాలను మోసే బాధ్యతగా మారాలి. సామాన్యుడికి తన కష్టం వస్తే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎర్రజెండా కార్యకర్త కావాలి. నాయకులు ఎసి గదుల్లో చర్చలు జరపడం కంటే, ఎండలో శ్రమిస్తున్న కూలీతో, పొలంలో ఉన్న రైతుతో, ఐటి ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్న యువతతో మమేకం కావాలి. నాయకత్వం అంటే ప్రసంగాలు చేయడం కాదు, ప్రజల కష్టాల్లో భాగస్వామి కావడం. కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం ప్రజాబాహుళ్యం నుంచి, ముఖ్యంగా దళిత, బహుజన, మైనారిటీ వర్గాలనుంచి ఎదగాలి. నాయకుడు ప్రజలకు ‘మార్గదర్శి’గా మాత్రమే కాదు, ‘సొంత మనిషి’గా కనిపించాలి. ‘నాయకుడు అంటే జెండా పట్టుకునేవాడు కాదు, ప్రజల గుండె చప్పుడిని తన జెండాగా మార్చుకునేవాడు.’

భారతదేశం మత విశ్వాసాలు కలిగిన దేశం. ఇక్కడ ‘నాస్తికత్వం’ కంటే ‘మానవత్వం’ ముఖ్యం. భారతీయ సామాన్యుడికి మతం అనేది ఒక భావోద్వేగం. ‘మతం మత్తుమందు’ అనే నిర్వచనాన్ని నేరుగా ప్రజలపై రుద్దడంవల్ల ఉద్యమం ప్రజలకు దూరమైంది. మతాన్ని విమర్శించడం కంటే, మతం పేరుతో సాగుతున్న రాజకీయాలను, దోపిడీని ఎండగట్టాలి. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని నిర్మించాలి. ఆధ్యాత్మికతకు, మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. శ్రమజీవుల సంస్కృతిని, జానపద కళలను, గ్రామదేవతల పండుగలను విప్లవ భావజాలంతో అనుసంధానించాలి. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూనే, వారిని దోపిడీ నుంచి రక్షించాలి. ‘ముక్కలైన ఎరుపు - ఒక్కటి కావాలి’. వ్యక్తిగత ఇగోలను పక్కన పెట్టి, పేదవాడి రాజ్యస్థాపన కోసం అన్ని వామపక్షాలు ఒకే జెండా కిందకు రావాలి. అప్పుడే అది ప్రజల్లో గెలుపుపై ధీమాను నింపుతుంది. సిద్ధాంతపరమైన చిన్న చిన్న భేదాలవల్ల పార్టీలు ముక్కలవ్వడం కేవలం శత్రువుకే లాభం చేకూరుస్తుంది. చీలికలు ఎప్పుడూ బలహీనతనే ఇస్తాయి. సిద్ధాంత చర్చల పేరుతో ముక్కలైన ఎరుపు ఇవాళ ఒక్కటవ్వాల్సిన చారిత్రక సంధికాలంలో ఉంది. కార్యకర్తలు, నాయకులు ఇగోలను పక్కన పెట్టి ‘ఒకే జెండా ఒకే అజెండా’ వైపు రావాలి. పది మంది పది దిశల్లో లాగితే రథం కదలదు, అందరూ ఒక్కటై లాగితేనే అది విజయ తీరాలకు చేరుతుంది.

కమ్యూనిస్టులు పాతకాలపు నినాదాలకు పరిమితం కాకూడదు, ఆధునికతను ఆహ్వానించడం ద్వారా 21వ శతాబ్దపు సవాళ్లును అధిగమించాలి. నేడు శ్రమ దోపిడీ డిజిటల్ రూపంలో జరుగుతోంది. సోషల్ మీడియాను, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. యువతకు అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన పద్ధతుల్లో సమానత్వం గురించి చెప్పాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు.. అభివృద్ధి అంటే ఉచిత విద్య, మెరుగైన వైద్యం, ప్రతి చేతికీ పని, పనికి తగ్గ వేతనం ఉండాలని బలంగా చాటాలి. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రకృతి వనరులను రక్షించాలి. ఆధునిక టెక్నాలజీని సామాన్యుడి సేవలో ఉపయోగించాలి. నేటి తరం యువతకు ఐటి ఉద్యోగాలు, స్టార్టప్‌లు, డిజిటల్ స్వేచ్ఛ ముఖ్యమని గుర్తించాలి. ‘జెండా ఎర్రగా ఉందని కాదు.. అది గుండె రక్తంలా ప్రతి మనిషిలోనూ ప్రవహిస్తుందని నిరూపించాలి. ‘ఎర్రజెండా అంటే కేవలం ధర్నాలు, ఆందోళనలు కాదు. అది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం కావాలి. ప్రజల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, కష్టసుఖాల్లో పార్టీ ఒక కుటుంబంలా ఉండాలి. ప్రజల మనసు గెలవకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం.

ఎర్రజెండా ప్రయాణం వంద ఏళ్లకే ఆగిపోయేది కాదు. ఇది నిరంతర ప్రవాహం. సిద్ధాంతంపట్ల నిబద్ధత, ఆచరణలో పారదర్శకత, ప్రజల పట్ల అంకితభావం ఉన్నప్పుడు ప్రజలే నాయకత్వాన్ని స్వీకరిస్తారు. ప్రజలను ఐక్యం చేయడమే మన కర్తవ్యం. ప్రజల నుండి పుట్టిన ఈ ఉద్యమం, తిరిగి ప్రజల వైపుకు వెళ్లినప్పుడే.. ఎర్రకోటపై ఎర్రజెండా రెపరెపలాడుతుంది. గడిచిన 100ఏళ్ల అనుభవాల పాఠం.. రాబోయే కాలం ప్రజావిజయాల కేతనం. మనువాదాన్ని మట్టికరిపిస్తూ, మతతత్వశక్తులను తరిమికొడుతూ, కార్పొరేట్ కబంధ హస్తాలనుంచి దేశాన్ని రక్షించాలంటే.. ఎర్రజెండా వెలుగులో భారత జాతీయవాద కమ్యూనిజం ఒక్కటే శరణ్యం. అణగారిన వర్గాల ఆశలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కలిసిన రోజున భారతదేశంలో ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడటం ఖాయం. ‘సూర్యుడు అస్తమించేది చీకటికోసం కాదు.. రేపటి ఉదయం నూతన కాంతితో ఉదయించడం కోసం.’


విశ్వ జంపాల

77939 68907