హైదరాబాద్: వారం రోజులుగా మక్క జొన్న కొనుగోలు కోసం రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే..సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదని అన్నారు. రైతులకు మద్దతుగా వరంగల్ జిల్లా రాయపర్తిలోని జాతీయరహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. రాయపర్తి శివారులో రైతుల వద్దకు వెళ్లి మక్కల రాసులు సందర్శించారు. ఆగ్రహంతో పండించిన పంటను తగులబెట్టాలని చూసిన ఎర్రబెల్లి రైతుకు సర్ది చెప్పారు. మండుటెండలో పడిగాపులు పడుతున్న రైతులకు అండగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్క కొనుగోలులో సిఎం రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎర్రబెల్లి మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ధర్నాముగించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బస్తాల కొరత, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్కక్తం చేశారు. మద్దతు ధర రూ.2400 ఉంటే..ప్రైవేట్ కు రూ.1600 అమ్ముకుని రైతులు మోసపోతున్నారని, మొక్కజొన్న కొనుగోలుపై ఈ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి దాపురించిందని, రైతు డిక్లరేషన్ లో పంట బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఆ హామీని బోగస్ చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మక్కలు కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.