గతేడాదితో పోలిస్తే సులువుగా ప్రశ్నాపత్రం

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ యూజీ పరీక్ష

రాష్ట్రంలో 199 కేంద్రాల్లో నిర్వహణ

సుమారు 97 శాతం మంది హాజరు 

ఈసారి కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్య కోర్సు ల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టె స్ట్) యుజి (నీట్ యుజి 2026) ప్రశ్నాపత్రం మ ధ్యస్థంగా ఉందని విద్యార్థులు,నిపుణులు పేర్కొన్నారు. గత ఏడాదితో ప్రశ్నాపత్రంతో పోల్చితే మాత్రం ఈసారి నీట్ యుజి ప్రశ్నాపత్రం కొంత సులభంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి వచ్చిన ప్ర శ్నలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ సరైన సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చిందని చెబుతున్నారు.

కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలలో ఎక్కువగా ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుంచి ప్రశ్నలు రాగా, ఫిజిక్స్‌లో క్యాలులేషన్స్ ప్ర శ్నలు ఎక్కువగా వచ్చాయని పేర్కొంటున్నారు. ఫి జిక్స్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, కె నమాటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, వేవ్ ఆప్టిక్స్, రొటేషన్, మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం టాపిక్స్ ప్రశ్నలు రాగా, కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రశ్నలు సులువు గా రాగా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు ట్రిక్కీగా ఉన్నాయని చెబుతున్నారు. బయాలజీలో హ్యూమన్ ఫి జియాలజీ, ఆనిమల్ హస్‌బెండరీ, బయోటెక్నాల జీ, హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ బయోమాలిక్యూల్స్, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజి నుంచి ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా ఫిజిక్స్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు సులువు నుంచి మధ్యస్థంగా, బయాలజీ ప్రశ్నలు సులువుగా వచ్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమమయ్యాయి.

ప్రశ్నపత్రం సులభంగా ఉన్నప్పటికీ, పోటీ మాత్రం అత్యంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉన్నందున, మార్కుల్లో స్వల్ప తేడా కూడా ర్యాంకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా ప్రశ్నాపత్రం సులభంగా ఉంటే కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో తుది ఫలితాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. నీట్ యుజి పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు మరో పదకొండు భాషల్లో అంటే మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు.

ప్రశాంతంగా జరిగిన పరీక్ష

దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్ యుజి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పెన్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా..ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 551 నగరాలు, పట్టణాల్లో 5,432 పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 నగరాలలో ఎన్‌టిఎ నీట్ యుజి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22,79,743 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, వారిలో 13,22,928 మంది బాలికలు, 9,46,815 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో నీట్ యుజి ప్రవేశ పరీక్ష నిర్వహణకు 199 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 71,500 మంది విద్యార్థులు అధికారులు వెల్లడించారు. నీట్ యుజి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 97 శాతం మంది పరీక్షకు హాజరుకాగా, 3 శాతం మంది గైర్హాజరు అయ్యారు.

ముందుగానే కేంద్రాలకు..

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ యుజి పరీక్షకు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలనే నిబంధన ఉండడంతో విద్యార్థులు చాలా వరకు గంటల ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. చెవుల దిద్దులు, కాళ్ల పట్టీలు, షూ, వంటి వాటిని పరిశీలించారు. హాల్‌టికెట్‌లో ఉన్న విద్యార్థి, పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ఒకరేనా అనే అంశంపై తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

ఫోటోలు మర్చిపోయిన విద్యార్థిని.. బైక్‌పై స్టూడియోకి పంపిన సిఐ

నీట్ యుజి పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి పోలీసు అధికారి సకాలంలో స్పందించి అండగా నిలిచారు. నీట్ పరీక్షకు తప్పనిసరి అయిన పాస్‌పోర్ట్ ఫోటోలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థినిని ఆదుకుని, ఆమె పరీక్ష రాసేందుకు వీలు కల్పించారు. పార్వతీపురం పట్టణానికి చెందిన బెహరా హిమబిందు నీట్- యుజి 2026 పరీక్ష రాసేందుకు విశాఖలోని ఓ కేంద్రానికి వచ్చింది.

అయితే, పరీక్ష హాల్‌లోకి వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తన వెంట తెచ్చుకోలేదని చివరి నిమిషంలో గ్రహించింది. దీంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోతానేమోనన్న ఆందోళనతో ఆమె కన్నీరు పెట్టుకోగా, ఆ సమయంలో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న మల్కాపురం సిఐ గొలగాని అప్పారావు, ఆందోళనతో ఉన్న హిమబిందును గమనించారు. ఆమె వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, ఓ కానిస్టేబుల్‌కు బాధ్యత అప్పగించారు. తన మోటార్‌బైక్‌పై హిమబిందును సమీపంలోని శ్రీహరిపురం ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి, ఫోటోలు తీయించాలని సూచించారు. ఫోటోలకు అవసరమైన డబ్బును కూడా సిఐ అప్పారావే తన సొంత జేబు నుంచి చెల్లించడం విశేషం. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ సిఐ చూపిన మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంటోంది.