
మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్‌లు రాజ్యమేలుతున్నారు. ఆ శాఖలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ సిబ్బంది, అధికారులపై ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేసి వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు వీరి ఆగడాల బారిన పడడం విశేషం. చివరకు వార్తలు రాసే జర్నలిస్టుల ఫోన్‌నెంబర్‌లను సైతం ఈ డాన్లు ట్రాకింగ్ చేయిస్తూ సమాచారం ఇచ్చే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయిని విక్రయించే వారి ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేయించాలన్న ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లేదా కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ, ఈ గంజాయి డాన్‌లు మాత్రం అనుమతి లేకుండానే ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేయిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది కలిసి గంజాయిని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగు చేయించడం, విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.
గంజాయి సాగు నుంచి విక్రయం వరకు..
అయితే, గంజాయి సాగు నుంచి విక్రయం వరకు ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఎక్సైజ్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అయితే, ఫిర్యాదు చేసిన వారిని ఈ ముఠా ఇబ్బందుల పాలు చేసినట్టుగా సమాచారం.
రోజుకు గంట పాటు గంజాయి విక్రయం
గంజాయి విక్రయించే కొన్ని ప్రాంతాలను ఈ ముఠానే ఎంపిక చేసి గంజాయిని ఏ సమయంలో అమ్మాలి, ఎక్కడి నుంచి కొనాలి, ఎంతసేపు విక్రయించాలన్న విషయాలను ఈ ముఠానే సూచిస్తుందని, సుమారుగా 40 మంది వరకు గంజాయి అమ్మకందారులు ఈ ముఠాతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటారని, ఒక్కొక్కరూ రెండు లక్షల రూపాయలను ఈ ముఠాకు నెలకు చెల్లించాలని, రోజుకు గంట మాత్రమే విక్రయాలు జరపాలని ఈ ముఠా అమ్మకందారులకు సూచించినట్టుగా తెలిసింది.
అమ్మకందారులు, కొనుగోలుదారులు ముడుపులు.....
అయితే, ఈ ముఠా నారాయణఖేడ్, విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొకైన్ సరఫరా చేసే వారు సైతం ఈ ముఠాకు నెల మాముళ్లు ఇవ్వాల్సిందేనని, కొకైన్, గంజాయిని కొనుక్కునే వారి నుంచి ఈ ముఠా నెల మాముళ్లు వసూళ్లు చేస్తుందని ఇవ్వకపోతే పిడి యాక్ట్ పెడతామని బెదిరింపులకు దిగుతుందని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.
ఈ ముఠా ఆగడాలు మచ్చుకు కొన్ని...
ఈ ముఠా ఆగడాలు మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి. గతంలో బంజారాహిల్స్ జివికె మాల్ దగ్గర ఒక వ్యక్తి కారులో కొకైన్ కొనుక్కోవడానికి రాగా అతని నుంచి రూ.11 లక్షలను స్వాధీనం చేసుకొని, ప్రభుత్వానికి ఈ లెక్కలు చూపలేదని ఆ వ్యక్తి అప్పటి కమిషనర్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈమధ్యన సికింద్రాబాద్ పరిధిలో కొకైన్ కొనుగోలు చేయడానికి కియా కారులో వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఈ ముఠా రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకొని బెదిరింపులకు గురి చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
11 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని
వీటితో పాటు కాచిగూడ పరిధిలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈ ముఠా సభ్యులు వారి ఇంటిపై దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న 11 మంది సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి ఇంట్లో ఉన్న రూ.5 లక్షలను స్వాధీనం చేసుకొని, దానికి సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చూపలేదని, తమ డబ్బులను ఈ ముఠా సభ్యులు తీసుకున్నారని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారిని కొట్టి, బెదిరించి డబ్బులు పోలేదని వారితో ఈ ముఠా లెటర్ రాయించుకున్నట్టుగా తెలిసింది. ఇలా, చెప్పుకుంటూ పోతే ఈ ముఠా బాగోతాలు అంతులేవని ఆ శాఖ అధికారులు, సిబ్బంది పేర్కొంటుండడం విశేషం.
ఫాంహౌస్‌లు, బార్‌లు, వైన్‌షాపుల యజమానులుగా....
ప్రస్తుతం ఈ ముఠాకు రాష్ట్రవ్యాప్తంగా అనుచరులు ఉన్నారని, ముఖ్యంగా ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలోనూ ఈ ముఠాకు అనుకూలంగా పనిచేసే వారు కూడా ఉండడం విశేషం. ఈ ముఠాపై ఫిర్యాదులు వస్తే వారికి వెంటనే చేరవేయడానికి కమిషనర్ పేషీలో ఓ వ్యక్తి, తమపై వచ్చిన ఫిర్యాదులపై ఫైల్ మూవ్ చేసినా అందులోని లూప్‌హోల్స్‌ను వెతికి వారికి అనుకూలంగా ఫైల్ రాయడానికి ఒక సూపరింటెండెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యవస్థనే ఈ ముఠా నడుపుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ముఠా సభ్యులకు ఒక ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో వారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా
ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకోవడానికి ఆ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు ముడుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా పేర్కొంటుండడం విశేషం. ఇలా సంవత్సరాల తరబడి కొందరు అధికారులు, సిబ్బంది గంజాయి, గుడుంబా నిర్మూలన కోసం ప్రత్యేక టీమ్‌ల్లో పనిచేస్తున్న వారిని సంవత్సరాల తరబడి అలాగే కొనసాగిస్తుండడంతో వారే డాన్‌లుగా అవతారం ఎత్తుతున్నారని, ప్రస్తుతం వారిని అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయకపోతే గంజాయి సాగు, అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముఠాలో పనిచేసే వారిలో కొందరికి ఫాంహౌస్‌లు, బార్‌లు, వైన్‌షాపులు కూడా ఉన్నాయంటే వారి సంపాదన ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.











