
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకెళ్లాల న్న విషయమై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంతో పాటు లీగల్‌గా ఎలా ముందుకెళ్లాలన్నా అంశంపై వా రిద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు సీనియర్ అడ్వకేట్లతోనూ ప్రభుత్వం లీగల్ ఓపినీయన్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది.
అయితే, ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని సీనియర్ అడ్వకేట్లు పేర్కొన్నట్టుగా సమాచారం. మొదటిది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ రెండు అంశాల గురించి బుధవారం సిఎం రేవంత్‌రెడ్డితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కోర్టు తీర్పుపై నేడు కేబినెట్ చర్చించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు కేబినెట్‌కు అడ్వకేట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత తదుపరి చర్యలను తీసుకోవాలని సిఎం రేవంత్ నిర్ణయించినట్టుగా సమాచారం. కేబినెట్‌లో తీసుకునే నిర్ణయం తరువాత ప్రభుత్వం ముందుకెళ్లనుంది.
నేడు కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని ఆరో అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుకు సంబంధించి కేబినెట్ చర్చించునుంది. దీంతోపాటు జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రారంభానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కేబినెట్‌లో చర్చించనున్నారు. త్వరలో అమలు చేయనున్న మరో రెండు కొత్త పథకాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. వీటితో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్‌లపై కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. ఆర్టీసి సమ్మె, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను కేబినెట్ ఆరా తీయనుంది.













