హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎంఎల్‌సిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే తనకు మంత్రి పదవి ఇచ్చారనేది నిజం కాదు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తోందని ప్రశంసించారు. ఎంఎల్‌సిగా తనని ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పిసిసికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అజారుద్దీన్ హామీ ఇచ్చారు.