సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా శివమ్ మావి లీగ్ నుంచి దూరమైన విషయం తెలిసిందే. గత మినీ వేలంలో మావిని రూ.75 లక్షలకు ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. అయితే అతడు గజ్జల్లో గాయం కారణంగా లీగ్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు అతడి స్థానాన్ని యువ ప్లేయర్ ఆర్ఎస్ అంబరీష్‌తో భర్తీ చేసింది. అంబరీష్ మీడియం పేస్ ఆల్ రౌండర్. అండర్-19 వరల్డ్ కప్-2026 విన్నింగ్ జట్టులో అతడు సభ్యుడు. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకింగ్ బౌలర్.

ఈ 18 ఏళ్ల కుర్రాడు కుడిచేతితో బౌలింగ్ చేస్తాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన అంబరీష్‌కు ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రఫుల్ హింగే, సకిబ్ వంటి కుర్రాళ్లకు సన్‌రైజర్స్ ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇంకా ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 3వ తేదీన ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.