
న్యాయవాదికి బ్రీత్ టెస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయక పోవడంపై న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణను కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. పోలీస్‌స్టేషన్‌లో సిసిటివి కెమెరాల ఫుటేజీని భద్రపరిచారా? అని ప్రశ్నించింది. సిసిటివి కెమెరాల ఫుటేజీని కోర్టుకు ఎందుకు అందజేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం కనబర్చింది. సిసిటివి కెమెరాల ఫుటేజీ సమర్పించ డానికి కొంత వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పంజాగుట్ట ఇన్ స్పెక్టర్‌పై శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, అడ్వకేట్లు కలిసి పనిచేయాలని న్యాయస్థానం సూచించింది. స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు చేయడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. గాయని మంగ్లీతో ప్రాణహాని ఉందం టూ డిజిపి శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి సుబ్బారావు తరఫు న్యాయవాది వెల్లడించారు. న్యాయవాది సుబ్బారావు సెక్యూరిటీ విషయంపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది.











