గాంధీనగర్ : గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బిజెపి సత్తా చాటింది. 15 మున్సిపల్ కార్పొరేషన్లను క్వీన్ స్వీప్ చేసింది. మంగళవారంనాడు వెలువడిన ఫలితాలు మరోసారి రాష్ట్రంలో కాషాయ పార్టీ పట్టును నిరూపించింది. మోర్బీ, పోరుబందర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్క స్థానం కూడా విపక్షాలకు దక్కకుండా వాటిల్లోని 52 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇటీవల 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మిగతా రెండింటి టర్మ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

తాజా ఫలితాల్లో అధికార బిజెపి ఆహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, గాంధీదామ్, సురేంద్రనగర్, మెహ్‌సానా, ఆనంద్, నదియాద్, నవ్‌సారి, వాపి కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. ఆహ్మదాబాద్‌లో 192 స్థానాలకు గాను బిజెపి 160 దక్కించుకోగా, కాంగ్రెస్ మిగతా 32 స్థానాల్లో విజయం సాధించింది.

గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఈ సారి మాత్రం సున్నాకు పరిమితమైంది. సూరత్ 120కి బిజెపి 115 గెలుచుకోగా, కాంగ్రెస్ ఒకటి, ఆప్ నాలుగింట విజయం సాధించాయి. రాజ్‌కోట్‌లో 72 స్థానాలకు గాను బిజెపి 65 ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఏడింట గెలిచింది. 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలుకా పంచాయతీలకు గత ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహించారు.

బిజెపితో ప్రజల గాఢానుబంధానికి నిదర్శనం : మోడీ

గుజరాత్ ప్రజలు సుపరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల మరోసారి తమ విశ్వాసాన్ని చాటారాని ప్రధాని మోడీ అన్నారు. ఈ విజయం వెనక కార్యకర్తల కృషి మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. మహా నగరపాలిక, నగరపాలిక, పంచాయతీల్లో గొప్ప విజయం ద్వారా బిజెపితో రాష్ట్ర ప్రజలకు ఉన్న గాఢమైన బంధం మరోసారి తేటతెల్లమైందని మోడీ అన్నారు. బిజెపి పట్ల మరోసారి తమ నమ్మకాన్ని చూపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సిఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు.