భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు. అతడు ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. సృష్టించాడు కూడా. ప్రస్తుతానికి జాతీయ జట్టులో కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న కోహ్లీ.. ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీర విహారం చేశాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు.

ఈ క్రమంలో కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్‌లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్‌సిబి) తరఫున 300 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకూ ఏ ఆటగాడు సాధించలేదు. గుజరాత్‌పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సులు ఉన్నాయి. వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సులు మాత్రం క్రిస్ గేల్ (కెకెఆర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్‌సిబి-357), రోహిత్ శర్మ (డెక్కెన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్-310) సాధించారు. అయితే ఫోర్ల విషయంలో మాత్రం ఎవరూ కోహ్లీకి చేరువలో లేరు. విరాట్ తర్వాత అత్యధిక బౌండరీల్లో మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768), ప్రస్తుత ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.