ఎన్‌ఆర్‌ఐ ధర్మేంద్ర, సినీనటి అషురెడ్డిల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ధర్మేంద్రతో రాజీకుదుర్చుకునేందుకు అషురెడ్డి ప్రయత్నించడం చర్చనీయాంశం అయింది. బిగ్‌బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి వివాహం చేసుకుంటానని, తనను నమ్మించి రూ.9.83కోట్లు తీసుకుని మోసం చేసిందని షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనను, తన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు.

తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి తోసిపుచ్చారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఆ కేసును కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. కేసు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అషురెడ్డి పంపిన ఆడియో మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వాయిస్ రికార్డ్‌లో...

బయటికి వచ్చిన ఆడియో రికార్డుల్లో అషురెడ్డి పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తన తరఫున జ్యోతిష్యుడు వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణా వస్తారని, అందరం కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామని అషురెడ్డి ప్రతిపాదించినట్లు తెలిసింది. ‘నాకు మే నెల వరకు సమయం ఇస్తే రూ. 1.5 కోట్లు ఇచ్చి సెటిల్ చేస్తాను. ప్రస్తుతానికి మే నెలే నాకు టార్గెట్‌గా కనిపిస్తోంది. మిగిలిన డబ్బును నేను జీవితంలో స్థిరపడిన తర్వాత తిరిగి ఇస్తాను’ అని ఆమె పేర్కొన్నట్లు ఆడియోలో ఉంది. ఈ వివాదంలోకి తన తల్లిని, సోదరిని (దివ్యారెడ్డి) లాగవద్దని, కేవలం తనతోనే మాట్లాడాలని ఆమె కోరినట్లు తెలిసింది. కేవలం సెటిల్‌మెంట్ మాత్రమే కాకుండా, బాధితుడిని ఆమె బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోకపోతే, నీపై వేధింపుల కేసు పెడతాను. నేను నీ ముఖం చూడాలని అనుకోవడం లేదు, ఈ విషయం గురించి మాట్లాడటం ఇష్టం లేదు’ అంటూ కఠినంగా స్పందించినట్లు ఆడియోలో తెలుస్తోంది.

ధర్మేంద్ర సంచలన ఆరోపణలు...

అషురెడ్డి తనను మానసికంగా, ఆర్థికంగా వేధించిందని బాధితుడు ధర్మేంద్ర పేర్కొన్నారు. అషురెడ్డి అవసరాల కోసం తాను పలు బ్యాంకుల నుంచి లోన్‌లు తీసుకుని ఖర్చు చేశానని తెలిపారు. ఆ లోన్లు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే, తనపై తిరిగి కేసు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని అషురెడ్డి బెదిరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి అషురెడ్డి ఈ డ్రామా ఆడిందని, తనను మోసం చేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.