
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాల కారణంగా నేడు మన దేశం నూటికి 80 శాతం ముడి చమురు, 56 శాతం సహజ వాయువును విదేశాలపై ఆధారపడి దిగుమతి చేసుకుంటున్న మూలంగా వీటి సరఫరాలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. దేశ ఆర్థిక ప్రగతికి కీలకమైన ఇంధన రంగాలు ఇలా విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం ఎంతటి విపరిణామాలకి దారి తీస్తుందో 199091 లో కువైట్ ఇరాక్ యుద్ధంవల్ల మనకి కొంత బోధపడింది. అయినా మన దేశ పాలకులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు. దీని మూలంగా నేడు దేశంలో అధిక జనాభా పెరుగుదల మరింత ఇంధన వనరుల అవసరత పెరగటంతో ఈ అమెరికా ఇరాన్ యుద్ధం మూలంగా మన దేశం ఇంధన సంక్షోభంలో నుండి ఇంధన విపత్తులోకి నెట్టివేయబడుతోంది. మన దేశంలో ఎల్‌పిజి గ్యాస్ ఉత్పత్తి 2014 15 లో 9.8 మిలియన్ టన్నుల ఉంటే అదే వినియోగం 18 మిలియన్ టన్నులు. ఇక 202021 లో ఉత్పత్తి 12.8 మిలియన్ టన్నులకి పెరిగింది. అదే వినియోగం 27.6 మిలియన్ టన్నులకి చేరింది. నేడు 202425 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 13 మిలియన్ టన్నులు ఉంటే వినియోగమేమో ఏకంగా 31.2 మిలియన్ టన్నులుగా నమోదైంది.
ఇలా మన దేశంలో సహజ వాయువు నిల్వలు తక్కువగా ఉన్నందున దేశీయ స్వయం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మరి అవసరాలేమో గృహ, వాణిజ్య అవసరాలకి కిరోసిన్, కట్టెలు, పిడకలు వినియోగం తగ్గుతూ స్వచ్ఛ ఇంధనంగా సులువుగా ఆహార పదార్థాలు తయారీకి అనువుగా ఉన్న ఎల్‌పిజి గ్యాస్‌ని ప్రభుత్వాలే రాయితీలు, సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహించాయి. తదనుగుణంగా ఎల్‌పిజి వినియోగం పెరగటంతో విదేశాలపై ఆధారపడి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన వస్తోంది. ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సస్టయినబుల్ డెవలప్‌మెంట్’ 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ప్రకారం 2012 13 లో 5.8 మిలియన్ టన్నుల ఎల్‌పిజిని మనం దిగుమతి చేసుకుంటే, 2018 19లో 13.5 కి పెరిగి, 202425 లో 20.7 మిలియన్ టన్నుల ఎల్‌పిజి దిగుమతికి పెరిగింది. దీని వల్ల మన దేశంలో 2024 25లో ఒక లక్ష 12వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం (ఫోరెక్స్)ని కోల్పోయింది.ఇలా ప్రతి ఏటా ఎల్‌పిజి ధరల పెరుగుదల మూలంగా దేశం 80 వేల కోట్ల నుంచి ఒక లక్ష కోట్లని గ్యాస్ ఎగుమతి దేశాలైన ఖతార్, యుఎఇ, రష్యా, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ దేశాలకు చెల్లించాల్సి వస్తోంది.
201415 లో దేశంలో ఎల్‌పిజి సిలిండర్లు గృహ కనెక్షన్స్ 14.52 కోట్లు ఉంటే, 202425 నాటికి 33 కోట్లకి చేరాయి. దీనిని ప్రధాన కారణం 2016 మే నెల 1వ తేదీన భారత ప్రధానమంత్రి దారిద్య్రరేఖకి దిగువనున్న మహిళలకు ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్స్ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించడమే. (ప్రధానమంత్రి ఉజ్జల యోజన (పిఎంయువై) పథకం ద్వారా 2016 నుండి 2026 10 కోట్ల (కొత్త కనెక్షన్స్ చేరి మొత్తంగా దేశంలో నేడు 33 కోట్ల ఎల్‌పిజి సిలిండర్స్ కనెక్షన్స్ నమోదయ్యాయి. 216 బాట్లింగ్ ప్లాంట్స్, 25 వేల అధీకృత డిస్ట్రిబూషన్ సెంటర్స్ కలిగి విపత్కర పరిస్థితుల్లో కేవలం 18 రోజులకే సరిపడ నిల్వలు ఉన్నాయి. భారత్‌కి ఖతార్‌తో సహజ వాయువు సరఫరా కోసం దీర్ఘకలిక ఒప్పందం ఉంది. ఇక యుఎఇ దేశం భారత్‌కి నాలుగవ అతి పెద్ద ముడిచమురు ఎగుమతిదారు, పైగా రెండో అతి పెద్ద ఎల్‌పిజి సరఫరాదారు కూడా. అందుకే అమెరికా కాల్పుల విరమణ సమయంలో హుటాహుటిన మన దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యుఎఇకి వెళ్లారు. మన దేశ పెట్రోలియం, సహజ వాయువు కేంద్ర మంత్రి హర్దీప్ సంగ్ ఖతార్‌కి వెళ్లి దేశ ఇంధన భద్రతతోపాటు, మన ప్రవాస భారతీయులు, కార్మికుల భద్రత సంక్షేమం తదితర అంశాలపై చర్చలు జరిపి రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియకి భారత్‌తోపాటు జపాన్, సౌత్‌కొరియా దేశాలు కీలక పాతర పోషించాలని ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో మన దేశ ఇంధన భద్రతకి భరోసా కల్పిస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తున్నది. అయితే శాశ్వత పరిష్కారానికి, స్వావలంబనకి ప్రత్యామ్నాయాలు మెరుగుపర్చాల్సి ఉంది.
ఐఐసిటి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వారు మన దేశంలో బొగ్గు నిల్వలు అపారంగానే ఉన్నందున కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా డిఎంఇ (డైమిథైల్ ఈథర్)ని ఉత్పత్తి చేసి మనం నిత్యం వినియోగించే ఎల్‌పిజిలో కలపడం మూలంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) వారు ఎల్‌పిజిలో ఈ డైమిథైల్ ఈథర్‌ని 20 శాతం మేర వినియోగిస్తే మంచిదే అని అనుమతించారు కూడా. అంతేగాక దీని వలన ప్రతి ఏటా 6.3 మిలియన్ టన్నుల ఎల్‌పిజి దిగుమతి భారం తగ్గి మన దేశానికి అమూల్యమైన విదేశీ మారక నిల్వల నిధులు ప్రతియేటా 4.04 అమెరికన్ బిలియన్ డాలర్లు అంటే (34,200 కోట్ల రూపాయలు) ఆదా అవుతాయని అంచనా వేశారు. ఈ గ్యాస్‌ని రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. నేరుగా బొగ్గుని ముడి పదార్థంగా వినియోగించే సింగిల్ రియాక్టర్ క్యాటలిటిక్ ప్రాసెస్‌లో డెరెక్ట్‌గా కోల్ గ్యాసిఫికేషన్ ఆధార్ షిన్‌గ్యాస్ నుండి ఈ ‘డై మిథైల్ ఈథర్’ని ఉత్పత్తి చేస్తారు. ఇక ఇన్‌డైరెక్ట్ విధానంలో అయితే మొదట షిన్ గ్యాస్ నుండి మిథనాల్ ఆ తరువాత ఈ ‘డైమిథైల్ ఈథర్‌ని ఉత్పత్తి చేస్తారు. కాలుష్యం కూడా తక్కువే.. అని. “Cool gosification for energy and chemical secuity” by EY parthenon and new era ceantech solution Ltd. 2026 ఏప్రిల్‌లో తెలిపింది. వంటగ్యాస్ ఉత్పత్తిలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధిస్తే, సమగ్ర సుస్థిరాభివృద్ధికి అదో చక్కటి చోదకశక్తి వనరుగా ఉంటుంది. వికసిత్ భారత్ 2047 విజన్ ఈ పథకాన్ని చేర్చాల్సి ఉంది.
కనుకుల యాదగిరిరెడ్డి
98667 89511













