
న్యూఢిల్లీ : విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వల్ల విమానాలను నడపడం కష్టంగా మారిందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమన చర్యలు తీసుకోకుంటే విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా మూసివేయడం తప్పమరో మార్గం లేదని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి మూకుమ్మడిగా మొర పెట్టుకున్నాయి. ఈమేరకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ పౌరవిమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది. విమానాల నిర్వహణలో 40 శాతం వాటా ఇంధనానిదే కావడం, ఇటీవల ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరగడంతో విమాన సంస్థలు ప్రభుత్వానికి పరిస్థితి వివరిస్తూ లేఖ రాశాయి.
కిలోమీటరుకు ఎటిఎఫ్ ధరలు రూ.2 లక్షల వరకు పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు దారి తప్పుతున్నాయి. విమానాల నిర్వహణలో ఇంధనం వాటా ప్రస్తుతం 40 శాతం కాగా, ఇప్పుడు 55 శాతం నుంచి 60 శాతం పెరిగింది. దీంతో విమాన రంగంపై ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగిందని విమానయాన సంస్థలు ప్రభుత్వానికి వివరించాయి. ఈ సమయంలో ప్రభుత్వ మద్దతు అందకపోతే విమాన సేవల మూసివేత శరణ్యమని పేర్కొన్నాయి. ఏటీఎఫ్‌ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు విమాన ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూడడానికి గతంలో మాదిరి క్రాక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు రెండింటికీ అదే ఇంధన ధరల విధానాన్ని అనుసరించాలని, ఎటీఎఫ్‌పై ఉన్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తొలగించాలని విమాన సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.












