
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 4 లేదా 5న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16న పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు 5,17,760 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,16,534 మంది(99.76 శాతం) హాజరయ్యారు. మార్చి 14న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఈనెల 14వ తేదీ వరకు కొనసాగాయి. పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే, ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది.
విద్యార్థులకు త్వరగా ఫలితాలను అందించాలనే ఉద్దేశంతో పరీక్షలు పూర్తికాకముందే ఈనెల 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ నెల 23న జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. పేపర్ల స్కానింగ్ ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ చేపడతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఎటువంటి సాంకేతిక సమస్యలు లేని పక్షంలో మే 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
















