
కామారెడ్డి: మాంసం కూర వండలేదని భార్యతో భర్త గొడవకు దిగాడు. దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి భార్య విసరడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోసంగి కాలనీలో కోదండం శివాజీ(28), లక్ష్మీ(23) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శివాజీ పాతసామాన్ల వ్యాపారం చేస్తుండగా లక్ష్మీ ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన తరువాత భార్య మాంసం కూర వండవా? అని భర్త అడిగాడు. ఆమె వండలేదని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి విసిరింది. కోడవలి భర్త మెడకు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మెడ నరం తెగిపోవడంతోనే అతడు అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. క్షణికావేశంలో భర్తను పొట్టనపెట్టుకున్నానని, ఇప్పుడు తాను జైలుకు వెళ్తే తన కూతుళ్లను ఎవరు చూసుకుంటారని ఆమె కన్నీంటి పర్యంతమైంది. శివాజీ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.















