
రెండున్నర ఇళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలు చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు
బిజెపి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉన్నది
గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేయాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో కెటిఆర్ సమావేశం
పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైన దిశానిర్దేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో శనివారం నందినగర్ నివాసంలో కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కెటిఆర్ ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు బిజెపి కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని వ్యాఖ్యానించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను వేయి రూపాయలకు పైగా పెంచడమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బిజెపి నిర్వాకం వలన ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపైన బిజెపికి వ్యతిరేకంగా నాయకులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచకుండా ఉండడంతోపాటు శుక్రవారం పెంచిన సిలిండర్ ధర పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన సిలిండర్ ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
సర్ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించాలి
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించాలని కెటిఆర్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎంఎల్‌ఎలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కెటిఆర్ సూచించారు.
త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమయత్తం కావాలని చెప్పారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలను ఆయన అభినందించారు. ఈ సందర్బంగా త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.















