మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు రాష్ట్రంలోని కొంత మంది కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ వ్యవస్థాపిక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అని వారు శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బావా బావమరిది పోటీ పడి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వారు విమర్శించారు. హరీష్ రావు బ్లాక్‌మెయిల్ రావుగా మారుతున్నారని వారు విమర్శించారు.

నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పదేళ్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రాలేదని వారు చెప్పారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హరీష్ రావు బెదిరిస్తున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల టెండర్ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షంలో కూడా సంపాదించాలన్నదే వాళ్ల ఆలోచన అని, సంపాదనే వాళ్ల పరమావధి అని వారు విమర్శించారు. హరీష్ రావుకు ధైర్యం ఉంటే తమతో చర్చకు రావాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.