హైదరాబాద్: ఈ రోజు ఒకరు కొత్త పార్టీ పెట్టారని..చాలామంది పార్టీలు పెడుతూ ఉంటారని.. కెఎపాల్ కూడా పార్టీ పెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కానీ, ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారనేది ముఖ్యమని అన్నారు. మాజీ ఎంఎల్‌సి కవిత కొత్త పార్టీపై రామచందర్ స్పందించారు. ఈ సందర్భంగా రామచందర్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని పార్టీలు వచ్చినా..ఎన్ని పార్టీలు ఉన్నా బిజెపికి ఇబ్బంది లేదని, ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో పార్టీ రోడ్ మ్యాప్ వివరిస్తామని, తెలంగాణలో బిజెపికి మంచి వాతావరణం ఉందని అన్నారు. కార్యకర్తలు సమన్వయం, సిద్ధాంతపరంగా పనిచేయాలని రామచందర్ సూచించారు. తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ దోచుకుంటుందని, కొత్తగా పెట్టిన బిడ్డ పేరు కూడా టిఆర్ఎస్ పార్టీనే అని అప్పుడు వాళ్లు, ఇప్పుడు వీళ్లు అందరూ రాష్ట్రాన్ని దోచుకునేవారేనని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి లేని పరిపాలన అందిస్తోందని తెలియజేశారు. చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాడింది బిజెపినే రామచందర్ రావు పేర్కొన్నారు.