
అధికార దాహం కోసం ఆత్మీయ బంధాలను, ఉద్యమ ఆశయాలను బలిపెడతారా..?
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ మహిళా నేతల ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికార దాహం కోసం ఆత్మీయ బంధాలను, ఉద్యమ ఆశయాలను బలిపెడతారా..అంటూ కల్వకుంట్ల కవిత తీరుపై బిఆర్‌ఎస్ నాయకురాలు తుల ఉమ, ఇతర మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విభేదాలు సహజం.. కానీ, అవి వ్యక్తిగత స్వార్థం కోసం కన్నతండ్రిని, నడిపించిన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడే స్థాయికి దిగజారడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీపైన, కెసిఆర్‌పైన కవిత చేసిన ఆరోపణలు ఖండిస్తూ పార్టీ మహిళా నేతలు తుల ఉమ, హరి రమాదేవి, ఉబ్బపల్లి నిరోష ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కెసిఆర్ బిడ్డ కాకపోతే కవిత ఎవరు..ఆమెకు గుర్తింపు ఎక్కడిది..? అని ప్రశ్నించారు.
ఇప్పుడు కెసిఆర్ బిడ్డ పార్టీ పెట్టింది అంటున్నారు తప్ప కవిత పార్టీ పెట్టారు అని అనడం లేదని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం, పదవుల కోసం కన్నతండ్రినే కాదనుకుని, ఆయనపైనే విమర్శలకు దిగడం చూస్తుంటే.. తెలంగాణ ఆడబిడ్డ తన తండ్రిని ఎదిరించాలి, నిందలు వేయాలనేనే విష సంస్కృతిని ఆమె ప్రోత్సహిస్తున్నారా..? అని ప్రశ్నించారు. భారతీయ కుటుంబ వ్యవస్థలో తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంతో గొప్పది అని... కానీ, కవిత ఆమె రాజకీయ చదరంగంలో ఆ పవిత్ర బంధాన్ని పావుగా వాడుకోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆరోపించారు. పేరు మార్చినంత మాత్రాన కవితపై ఉన్న అవినీతి మరకలు, వెన్నుపోటు ఆరోపణలు చెరిగిపోవు అని పేర్కొన్నారు. నిజంగా ప్రజా సమస్యలతో పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారు అని, ఎవరి స్వలాభం కోసమో పార్టీ పేడితే ప్రజలు ఆదరించరని అన్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా బిఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం సాగిందని తెలిపారు.
బిఆర్‌ఎస్ (నాడు టిఆర్‌ఎస్) పార్టీ గాలిలో పుట్టిన పార్టీ కాదు అని, ప్రజల ఆవేదన నుంచి నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ అని పేర్కొన్నారు. కెసిఆర్ ఎప్పుడూ ప్రజా సమస్యలను కేవలం రాజకీయ కోణంలో చూడలేదని, ఉద్యమ కాలంలో గ్రామా గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను గుర్తించి, వారి సమస్యలనే తన ఆయుధాలుగా మార్చుకుని ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ధీశాలి అని చెప్పారు. పదేళ్ల పాలనలో కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను చేర్చిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీది అని పేర్కొన్నారు. కెటిఆర్‌కు ఏం తెలియదని కవిత అంటున్నారని, ఏం తెలియకుండానే నాలుగు సార్లు ఎంఎల్‌ఎ, రెండు సార్లు మంత్రి అయ్యారా..? అని ప్రశ్నించారు.
కెటిఆర్ తెలంగాణ స్థాయిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేశారని చెప్పారు. హరీష్ రావు నిత్య శ్రామికుడు అని, ఆయనను కవిత దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. కవిత పదేళ్లు అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే తండ్రికి అండగా ఉండాల్సింది పోయి కొత్త కుంపటి పెట్టడం ముమ్మాటికీ వెన్నుపోటు చర్యే అని పేర్కొన్నారు. ఆమె బిఆర్‌ఎస్ పార్టీలో పదవులు అనుభవించినప్పుడు తప్పులు కనపడలేదా..? అని ప్రశ్నించారు. కవిత ప్రసంగంలో ఎక్కడా ప్రజా హితం కనిపించలేదు అని,ఆమె ప్రతి మాట వెనకాల రేవంత్ రెడ్డి బాషా కనిపిస్తుందరి విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఒక సముద్రం అని, అటువంటి పార్టీ నుంచి కవిత విడిపోవడం వల్ల నష్టం ఆమెకే తప్ప పార్టీకి కాదని అన్నారు. తండ్రిని గౌరవించలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారో అందరికీ తెలుసు అని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలే కవిత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కవిత అబద్ధపు ప్రచారాలను, కుట్రలను బిఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా తిప్పికొడతారని అన్నారు.
















