ఇటీవల సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాతన్ కేస్ తీర్పులో ఒబిసి రిజర్వేషన్లలో అభ్యర్థులు క్రీమీలేయరా? లేదా నాన్ క్రీమీలేయరా అనే విషయాన్ని నిర్ధారించేటప్పుడు ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ధారించడానికి తప్పుపడుతూ, చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖలో ఒబిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులకు, అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒబిసి (నాన్ క్రీమీలేయర్) సర్టిఫికెట్ జారీ చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్లకు చెంపపెట్టుగా భావించాలి. దేశంలో మొత్తం 8రకాల రిజర్వేషన్లను విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో ఎవరికీ లేని క్రీమీలేయర్ సమస్య కేవలం బిసి రిజర్వేషన్లపై ఉంది. కారణం భారత రాజ్యాంగంలోని లోపాలు నేడు బిసి కులాల పాలిట శాపంగా మారింది.

రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప బిసి కులాలకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. బిసి రిజర్వేషన్లు క్రీమీలేయర్ సమస్యను పరిశీలించినట్లయితే 1992లో సుప్రీంకోర్టు 9మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా 27% రిజర్వేషన్లు అమలు చేయాలని, అమలు చేసే క్రమంలో ఒబిసి కులాల్లోని సంపన్న శ్రేణికి చెందిన వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించి ఒబిసి రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. సదరు తీర్పులో ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పిన అంశం ఏమనగా? రాజ్యాంగం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరుల రిజర్వేషన్లు ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల మాదిరిగా కులాల /తెగల ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లు కావు అని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిసి/ఒబిసి జాబితాల్లో కులాలను చేరుస్తున్నారు కాబట్టి ఆయా కులాల్లో సామాజికంగా అభివృద్ధి చెందినవారిని సంపన్న శ్రేణివర్గంగా గుర్తించి రిజర్వేషన్ల పరిధినుంచి తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం 1993లో ఒబిసి రిజర్వేషన్లలో సంపన్నశ్రేణిని జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన సమర్పించిన నివేదిక ఆధారంగా ఒబిసి కులాల్లో ఆరు తరగతులను సంపన్నశ్రేణిగా ప్రకటిస్తూ ఇందులో రెండవదైన ఉద్యోగుల పిల్లలకు సంబంధించి మూడు విభాగాలుగా గుర్తించింది (ఎ) తండ్రి లేదా తల్లి ఇద్దరిలో ఎవరైనా ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్ -1, కేటగిరి- ఏ, క్లాస్ -ఏ ఉద్యోగాల్లో నేరుగా నియమించబడినట్లయితే వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గంలోకి వస్తారు. వారికి ఒబిసి రిజర్వేషన్లు వర్తించవు (బి) తల్లి లేదా తండ్రి గ్రూప్ -2, క్లాస్ -2పోస్టులో నియమించబడి గ్రూప్ -1 పదోన్నతి 40 సంవత్సరాలలోపు పొందినట్లయితే, తల్లి, తండ్రి గ్రూప్-2 పోస్టులో నేరుగా నియమించబడినట్లైతే వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గంలోకి వస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు (సి) ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్శిటీల్లో పనిచేస్తున్న తండ్రి లేదా తల్లుల సమానత్వపు హోదాను పైన (ఎ) & (బి)లో తెలిపిన నిబంధనల ప్రకారం వారి హోదాను బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి వర్గానికి చెందుతారా? లేదా? అనేది నిర్ధారించాలి.

ఒకవేళ ప్రభుత్వంలోని పోస్టులకు సమానమైన పోస్టులను గుర్తించనట్లయితే వారికి ఆదాయ/సంపద టెస్టుద్వారా వారి సంతతి క్రిమిలేరా? కాదా? అనేది నిర్ధారించాలని తెలిపింది. 1993లో జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన నిపుణుల కమిటీ శాస్త్రీయబద్ధంగా నివేదికను సమర్పించింది. ప్రధానంగా ఒక వ్యక్తి ఆడ లేదా మగ సంపన్న శ్రేణి వర్గానికి చెందిన వారా? లేదా? అనే నిర్ధారణ వారి తల్లి లేదా తండ్రి హోదాపై/ఆస్తులపై/భూగరిష్ట పరిమితి నిబంధనపై/జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో కూడిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. 2015 నుండి నేటి వరకు సుమారుగా 100 మందికిపైగా ఒబిసి అభ్యర్థులు నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ సమర్పించి కేంద్రీయ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనారు. వారి తల్లిదండ్రులు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు కాబట్టి కేంద్ర ప్రభుత్వలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌లోని అధికారులు అభ్యర్థులు సమర్పించిన నాన్ క్రిమినల్ సర్టిఫికెట్‌పై అభ్యంతరం తెలుపుతూ, వారి తల్లిదండ్రుల పోస్టులు ప్రభుత్వ పోస్టులతో సమానత్వాన్ని కలిగిన నిరూపణ లేదనే సాకుతో వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి ఉద్యోగాలను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అందులో కొందరు అభ్యర్థులు ఒబిసి నాన్ క్రీమీలేయర్ కోటాలో ఐఎఎస్ ఉద్యోగం పొందవలసిన వారికి ఐపిఎస్ ఉద్యోగం ఇచ్చారు. ఐపిఎస్ ఉద్యోగం రావలసిన వారికి ఇతర పోస్టులను కేటాయించారు. మరికొందరికి ఉద్యోగ నియామకాన్ని నిరాకరించారు. ఇందులో కొంతమంది అభ్యర్థులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెన్నై, తమిళనాడు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారుల నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ కేసులు వేశారు. అందులో గౌరవ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెన్నై, హైకోర్టులు కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరును తప్పుపడుతూ, అసలు సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం/ హోదా ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాజంలో గౌరవం/ హోదా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండదు.

అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలను పరిగణనలోనికి తీసుకొని ఒబిసి నాన్ క్రీమీలేయర్ కోటాలో రావలసిన ఉద్యోగాలను నిరాకరించడాన్ని తప్పుపడుతూ, వెంటనే సదరు అభ్యర్థుకు ఒబిసి నాన్ క్రీమీలేయర్ కోటాలో నియామకాలు ఇవ్వాలని ఆదేశించాయి. అయినా కేంద్ర ప్రభుత్వ అధికారులు హైకోర్టు తీర్పులను పక్కన పెడుతూ, సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ వేసిన అప్పీల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, హైకోర్టు ఉత్తర్వులను ఆమోదిస్తూ 2004లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన పేరా 9 రాజ్యాంగ విరుద్ధమని తెలుపుతూ, మొత్తంగా 1993లో ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండంను ఆమోదిస్తూ, సదరు నష్టపోయిన అభ్యర్థులకు వెంటనే సూపర్ న్యూమరి పోస్టుల్లో వారికి రావలసినటువంటి ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ తదిర ఉన్నత పోస్టుల్లో నియమించాలని మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

- కోడెపాక కుమార స్వామి

94909 59625