
మన తెలంగాణ/శంకర్‌పల్లి: గాలివాన నుంచి ప్రాణాలు కాపాడుకుందామని షెడ్డు కిందకు వె ళ్లిన కార్మికులకు, అదే షెడ్డు మృత్యుపాశమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని ఎన్‌సిసి (నాగార్జున కన్స్ట్రక్షన్స్) కంపెనీలో భారీ క్రేన్ షెడ్డుపై విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం శంకర్ పల్లి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలివాన మొదలైంది. ఆ సమయంలో ఎన్‌సిసి కంపెనీ బ్రిక్స్, భారీ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులు వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఒక రేకుల షెడ్డు కిందకు చేరారు. అయితే గాలి తీవ్రతకు షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి కార్మికులు ఉన్న షెడ్డుపై కుప్పకూలింది.
భారీ క్రేన్ ఒక్కసారిగా పడటంతో షెడ్డు కింద ఉన్న వారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. క్రేన్ ఇనుప విడిభాగాల కింద నలిగి ఐదు మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా సమయంలో షెడ్డు కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్రేన్ కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పలువురికి ఆపరేషన్లు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విషాదంలో కుటుంబాలు
పొట్టకూటి కోసం వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇలా ప్రమాదానికి గురవడం తీవ్ర విషాదాన్ని నింపింది.ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కంపెనీ యాజమాన్యం భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాలివాన సమయంలో క్రేన్ పటిష్టతపై ముందే జాగ్రత్త పడాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను చేవెళ్ల అస్పత్రికి తరలించారు. క్షత గాత్రులను శంకర్‌పల్లిలోని లలిత అస్పత్రిలో చేర్పించారు. వీరిలో బీహార్ రాష్టానికి చెందిన నాగేందర్ (38), అలీ హుస్సేన్ (37), సాజిమ్ (51), ముకేశ్ కుమార్ (20) ఉత్తరప్రదేశ్ కు చెందిన సోను చౌదరి (26)లు మృతి చెందారు. డీసీపీతోపాటు పోలీస్, రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 12 మందిని శంకర్ పల్లిలోని ప్రైవేట్ అస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంపై అనుమానాలు
ప్రమాదంపై అన్ని భద్రత చర్యలు పాటించామని ఎన్‌సిసి ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రేన్‌ను లాకింగ్ చేశారా లేదా అనేది అనుమానంగా మారింది. గాలి వానకు అంత పెద్ద క్రేన్ కిందకు పడే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు.












