
హైదరాబాద్: మాజీ ఎంఎల్‌సి కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా ప్రకటించారు. తన పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని కవిత తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలైనా ప్రజల కల సాకారం కాలేదని, తెలంగాణ ఉద్యమ రథం గాడి తప్పిందని విమర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం నుంచి ఆమె మాట్లాడారు. ఆనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన కుటుంబంలో తాను కూడా ఓ భాగమని, ఆనాటి పాలనలో తాను భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని, ఎన్నో తప్పులు జరిగాయని, ఎన్నో నేరాలు జరిగాయని, తనని క్షమించాలని కవిత కోరారు. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదేనని, తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదన్నారు. కలలు కోసం పోరాటాలు సరిపోవని, అందుకే పార్టీ పెట్టానని, తప్పులు సరిదిద్దుకోవడానికే తాను తెలంగాణ రాష్ట్ర సేవ పేరుతో మీ ముందుకొచ్చానని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నానని, బిడ్డల కష్టం తల్లికే తెలుస్తుందని, రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయని కవిత స్పష్టం చేశారు. అప్పటి కెసిఆర్ వేరు.. ఇప్పటి కెసిఆర్ వేరు అని విమర్శించారు.













