
మన తెలంగాణ/హైదరాబాద్: ‘బిఆర్‌ఎస్ అధినే త, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మర మనిషా.. మనసున్న మనిషా? అనే కవిత ప్రశ్నలకు తొలుత కెసిఆర్ జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం కౌ న్సిల్ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. భ విష్యత్తులో బిజెపితో కలిసి పోటీ చేయబోమని కె సిఆర్ ఒట్టేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించా రు. కెసిఆర్‌కు చెడు జరగాలని ఆ కుటుంబ సభ్యు లే తప్ప ఎవరూ కోరుకోవడం లేదన్నారు.
కెసిఆర్ తనకు శత్రువు కాదు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి మాత్రమేనని అన్నారు. బిఆర్‌ఎస్ చచ్చిన శవంతో సమానమని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా, బిఆర్‌ఎస్‌కే మనుగడ లేనప్పుడు కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడాలని ఆయన దాట వేశారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌కు సంబంధాలు తెగిపోయాయని అన్నారు.
రాష్ట్ర విభజనలో బిఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించడం గురించి ప్రశ్నించగా, శ్రీకృష్ణ కమిటి వేసింది కేంద్రం అని, నివేదిక ఇచ్చాక గతమే అవుతుంది కదా? అని ఆయన ఉదహరించారు. ఇప్పుడు ఆ పార్టీ ఎక్స్‌పైరీ అయ్యిందని చెప్పారు. స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటిష్ వారినే దేశానికి ప్రధానిగా చేయలేం కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం బిఆర్‌ఎస్ ఆవిర్భావం ఉద్దేశం నెరవేరింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీతో పనేమి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ఎలాంటి భాష వాడినా, ఎంత అసహ్యంగా వ్యవహరించినా రాష్ట్ర సాధన కోసం ప్రజలు భరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అహంకారం అహంభావం చూసి కూడా పదేళ్ళు భరించారని ఆయన తెలిపారు. 14 ఏళ్ళు చేసిన ఉద్యమం వారిని కాపాడిందన్నారు. ఇవన్నీ చూసిన ప్రజలు 2023లో ఓడించారని, తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఆయన అన్నారు.
కుటుంబంలో పంపకాల పంచాయితీ..
ప్రజలను వంచించేందుకు మరొక ముసుగు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన బిఆర్‌ఎస్‌నుద్ధేశించి విమర్శించారు. పంపకాల పంచాయతీతో ఒక అనుబంధ విభాగం బయటకు వచ్చిందన్నారు. వాళ్ళంతా ఒక్కటేనని, ఒకే తాను ముక్కలని, ఒకే చెరువు నీళ్లకు రంగు, రుచి, వాసన మారదు అని దుయ్యబట్టారు.కెసిఆర్‌కి దెబ్బ తగలగానే యశోద ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు తాను స్వయంగా కెసిఆర్ సీటు వద్దకు వెళ్ళి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నానని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ మంచిగా ఉండాలని కోరుకుంటానే తప్ప చనిపోవాలని ఎందుకు కోరుకుంటానని ఆయన తెలిపారు. కెసిఆర్‌కు ఏదో ఒక చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు.నేపాల్ రాజును చంపింది కుటుంబ సభ్యులేనని ఆయన చెప్పారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని ఆయన తెలిపారు. కెసిఆర్ తనకు శతృవు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్ధి మాత్రమేనని ఆయన తెలిపారు.
కెసిఆర్ వద్ద ఉన్న సీఎం సీటును తాను గుంజుకున్నానని, ఇంకా కెసిఆర్ వద్ద ఏముందన్నారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా కెటిఆర్ సీఎం కావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కెటిఆర్ మాట్లాడించలేదా? మీకు గుర్తు లేదా? అని ముఖ్యమంత్రి విలేకరులనుద్ధేశించి ప్రశ్నించారు. కెసిఆర్‌కు మందులు అందించే వాడు విరాసత్ (వీలునామా) రాయించుకుంటే మిగిలిన ముగ్గురుకి ఇబ్బంది అని ఆయన నవ్వుతూ అన్నారు.ఓడిపోవడం కెసిఆర్‌కు కొత్తదేమీ కాదని, కాంగ్రెస్‌కు గెలుపు కొత్తదేమీ కాదని ముఖ్యమంత్రి అన్నారు. తాను గెలవడం వరుసగా జరుగుతూనే ఉందన్నారు. అక్రమ ఆస్తులు తొలగిస్తుంటే వాటిని కాపాడుకోవడానికి అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ మొదటి సంతకం చేస్తానని కెసిఆర్ అన్నారని ఆయన విమర్శించారు. అమీన్ పూర్‌లో భూములు ఆక్రమించుకుంది బిఆర్‌ఎస్ వాళ్ళే కదా ? అని ఆయన ప్రశ్నించారు.
తొలగింపు ప్రక్రియలో..
కవిత కొత్త పార్టీ, చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, తాను వాటిని చూసేంత దూరం రాలేదన్నారు. అయినా ఆ పార్టీ (బిఆర్‌ఎస్) నాయకులు తొలగింపు (ఎలిమినేషన్ ప్రాసెస్)లో ఉంటూ వారికి వారే పోటీ పడుతున్నారని, చివర ఎవరో మిగిలి వస్తారో చూద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబ పంచాయితీపై తనకేమీ ఆసక్తి లేదన్నారు. కెసిఆర్ ఇంటికి కూడా తాము వాటర్ ట్యాంక్ పంపిస్తున్నామంటే ఇక మీరు అర్థం చేసుకోవాలని ఆయన విలేకరులనుద్ధేశించి అన్నారు. దీనిని బట్టి తమకు వివక్ష లేకుండా పాలన చేస్తున్నామని అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.
కాళేశ్వరం కేసుపై కేంద్రంతో..
కాళేశ్వరం కేసులో త్వరితగతిన సిబిఐ విచారణ జరిపించాలని తాము కేంద్రంపై వత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సిబిఐ డైరెక్టర్‌ను కలిసి కోరేందుకూ అప్పాయింట్‌మెంట్ కూడా అడుగుతామని ఆయన తెలిపారు. ఈ కేసులో హరీష్ రావు, కెసిఆర్ కోర్టులో ఏం పిటిషన్ వేశారు అనేది చూడాలని అన్నారు. కాళేశ్వరం అవినీతి అక్రమాల ఆరోపణలపై తాము పిసి ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ జివో ఇస్తే అది చట్ట విరుద్ధం అని కోర్టుకు ఎందుకెళ్ళారని ప్రశ్నించారు. కోర్టు..3 సెక్షన్ ప్రకారం విచారణ కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదు..చట్టవిరుద్ధం కాదు అని కోర్టు చెప్పిందన్నారు. జివోను కొట్టేయం అని కోర్టు చెబితే అది బిఆర్‌ఎస్ విజయం అవుతుందా?, బిఆర్‌ఎస్ సంబరాలు చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఘోష్ నివేదిక రద్దు చేయాలని రెండో ప్లీ వేశారని ఆయన తెలిపారు. అభ్యర్థనపై నిర్ణయం తీసుకోలేం, కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాబట్టి రిలీఫ్ ఇవ్వలేం అని కోర్టు చెప్పిందని ఆయన వివరించారు. సెక్షన్ 8(బి) ప్రకారం వెసులుబాటు ఇవ్వలేదని అనే కోర్టు చెప్పిందని ఆయన తెలిపారు. మూడో ప్లీ లో కొంత రిలీఫ్ మాత్రమే వచ్చిందన్నారు. సెక్షన్ 8బి ప్రకారం సహజ న్యాయసూత్రాలను పాటించలేదు కాబట్టి వాళ్ళను ఫిక్స్ చేసిన అంశాల్లో చర్యలు వద్దని చెప్పిందన్నారు. విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మూడు నివేదికల గురించి తాము చెబుతున్నామని, వారు కాదంటున్నారని ఆయన తెలిపారు. అందుకే సిబిఐ విచారణ చేయాలని తాను కోరుతున్నానని అన్నారు. కేంద్రం తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం రాజకీయంగా ఆలోచనలు చేస్తే..
ఈ విషయంలో కేంద్రం రాజకీయంగా ఆలోచన చేస్తే తమ పార్టీకి కార్యాచరణ ఉంటుందన్నారు. అంతేకాదు సీఎంగా తన కార్యాచరణ కూడా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాయింట్లపైనే సిబిఐ విచారణ కోరిందని బిజెపి నాయకులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన విమర్శ గురించి ప్రశ్నించగా, సిబిఐ ఏ ఫైలూ అడిగినా ఇస్తామన్నారు. ఒక దొంగను పట్టుకున్న తర్వాత వాడి పాత చరిత్రను కూడా తోడుతారా? లేదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అదేవిధంగా సిబిఐ తొలుత విచారణ ప్రారంభిస్తే, ఆ తర్వాత వారు ఎంత లోతుకైనా వెళ్ళేందుకు అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు వారు ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే విచారణ కోరుకుంటుంటే అభ్యంతరం దేనికని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒప్పందంతో బిజెపి నేతలు ఏదో అంటున్నారని ఆయన విమర్శించారు. సిబిఐ విచారణకు ఆదేశించగానే నలభై ఎనిమిది గంటల్లో జైలులో వేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనలేదా? అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
అసెంబ్లీ లో చర్చ సందర్భంగా నివేదిక కాపీలు కూడా ఇచ్చామని, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది, కూలింది, ఎన్‌డిఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చిందీ గత ప్రభుత్వ హయాంలోనే కదా అని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఎన్‌డిఎస్‌ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిందని, అందులో డిజైన్, నిర్వహణ, నిర్మాణం, నాణ్యతలో లోపాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్‌డిఎస్‌ఏ, విజిలెన్స్, పిసి ఘోష్ కమిషన్ నివేదికలపై తాము చర్యలు తీసుకోవడం లేదని, కేవలం సిబిఐ విచారణ ద్వారా తేలాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. బిజెపి నేతలు చెప్పే మాటలను, సిబిఐనీ చెప్పమనండి అన్నారు. మా మామ 9 వేల కోట్లు కాదు లక్ష కోట్లు కొట్టేశారని హరీష్ రావు సిబిఐకి చెబితే మొత్తం విచారణ జరుగుతుంది కదా? అని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి తెలిపారు.











