నేను, నా సాహితీ యాత్ర: మనం ఏకాంతంగా కూర్చుని రాసినా, అది లోకంతో జరిపే సంభాష ణే. నా లోపల జరిగే అంతర్మథనం, బయట ప్రపంచం చూపే స్పం దనల సంఘర్షణే నా అక్షర ప్రయాణం. ఇండో-, చైనా యుద్ధ వాతావరణంలో పుట్టానని శాంతి ప్రబోధ అని పేరు పెట్టారు నాన్న. వరంగల్ జి ల్లా గణపురంలో పుట్టి, ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామం బుద్దిపల్లిలో పెరిగాను. మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేశాక బిసిజె, సామాజిక శాస్త్రం, తెలు గు సాహిత్యం, ట్రాన్సిలేషన్‌లో పిజి డిప్లొమా చదివాను. పత్రికారంగంలో కొద్దికాలం, ఎక్కువ కాలం సామాజిక సేవారంగంలో క్రియాశీలంగా పనిచేశాను. క్షేత్రస్థాయిలో మనుషుల్ని, వారి కష్టాల్ని దగ్గరగా చూశాను. మనుషుల్ని, సమాజాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నా కార్యరంగం బాగా ఉపయోగపడింది. వృత్తి రీత్యా మన దేశంతో పాటు అమెరికా, స్వీడన్, ఫిన్లాండ్ లలో పాల్గొన్న సదస్సులు, సామాజిక కార్యక్రమాలు, అధ్యయనం, మనుష్యులు, సంఘటనలు ప్రపంచాన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి దోహదమయ్యాయి.

మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న సామాజిక స్పృహ గల రచయిత. అమ్మ మంచి చదువరి. నా న్నమ్మకి సామాజిక చైతన్యం ఎక్కువ. ఆ వాతావరణమే పరోక్షంగా నా సాహితీ ప్రయాణాని కి పునాది. కాలేజీ రోజుల్లో, భవిష్యత్తును నిర్ణయించే ‘ఓటు’ ప్రాముఖ్యత చెప్పాలనే తపనతో రాసిందే నా మొదటి కవిత ‘ఓ ఓటరుడా’. స్థానిక పత్రిక ‘తెలుగు నిజస్వరూపం’లో 1982 చివర్లో ప్రచురణయింది. చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు నా హృదయం ఇచ్చిన తొలి ప్రతిస్పందన అది. అదే స్పూర్తితో 1983లో మహిళలకు ఆస్తిహక్కు చట్టంపై రాసిన ‘ప్రజలలో చైతన్యం రానిదే చట్టాలు నిరర్ధకం’ వ్యాసం అచ్చయ్యాక వచ్చిన సానుకూల స్పందన రచనా ప్రయాణంలో నన్ను ముందుకు నడిపింది. కవిత్వంతో మొదలుపెట్టినా, ఎక్కువ రాసింది వచనమే. అక్షరాస్యత-, సారా ఉద్య మ సమయంలో నిజామాబాద్ రేడియో కోసం రాసిన ‘అతివ ఆదిశక్తిగా మారిన వేళ’ మొదటి కథ.

ప్ళ్ళై నిజామాబాద్ జిల్లా వర్నిలో అడుగుపెట్టాక జోగినీ వ్యవస్థ గురించి తెలిసింది. లవణం, హేమలత లవణం దంపతులతో కలిసి ‘సంస్కార్’లో జోగినీ దురాచార నిర్మూలన, పునరావాస కార్యక్రమాల్లో భాగమయ్యాను. ఆ చీకటి జీవితాల, గుండె గాయాల దళిత మహిళల హక్కులను కాలరాయడాన్ని, మతం, సంప్రదాయం పేరుతో ఉన్న ద్వంద్వ నీతిని ప్రశ్నించిన నా మొదటి నవల ‘జోగిని’. ఈ నవల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళలు, అవకాశం వస్తే ఎంత ధైర్యంగా, నిటారుగా తల ఎత్తుకు తిరగగలరో చెప్పింది. నేల, స్త్రీ, పర్యావరణం మధ్య సంబంధం, మహిళా సాధికారతతో బతుకు పండించుకున్న నవల ‘బతుకుసేద్యం’. వాస్తవ సంఘటనలే ఆధారం. మూడు తరాల మహిళల వ్యక్తిత్వాలపై, వారి జీవన సంఘర్షణపై రాసిన ధారావాహిక ‘నిష్కల’. జోగిని వార్త దినపత్రిక, విహంగలలో, బతుకుసేద్యం కొలిమిలో, నిష్కల నెచ్చెలిలో ధారావాహికగా వచ్చాయి. ఆరు కథాసంపుటాలు, లేఖాసాహిత్యం, రెండు బాలల నవలలు. ఆరు బాలల బొమ్మల కథల పుస్తకాలు అచ్చయ్యాయి.

తెలంగాణ సారస్వత పరిషత్ కోసం జనరల్ నాలెడ్జ్ పుస్తకం విజ్ఞానం, వికాసం రూపకల్పన చేశాను. సమకాలీన సామాజిక అంశాలపై స్పందించి ఏ ప్రక్రియలో ఒదిగితే ఆ ప్రక్రియలో రాయడం, ఏ వస్తువు తీసుకున్నా క్షుణ్ణంగా పరిశోధించి, అధ్యయనం చేయడం అలవాటు. బాలల ఊహలకు రెక్కలిచ్చే బాలసాహిత్యం సృష్టించడం ఇష్టం. ‘జోగినీ’ తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవల, కందుకూరి నవల, ఇందూరు అపురూప పురస్కారాలు అందుకున్నది. ‘బతుకుసేద్యం’ తెలంగాణ సారస్వత పరిషత్, ఎన్జీ రంగా, కడప రెడ్డెమ్మ పురస్కారాలు అందుకుంది. కథలు ఎన్నో పురస్కారాలు, బహుమతులు అందుకుని రచయితగా నా బాధ్యతను పెంచాయి. భిన్నమైన మనుషుల జీవితాలు, వివిధ అస్తిత్వ రాజకీయాలు, సామాజిక, జెండర్, పర్యావరణం అంశాలు నిక్కచ్చిగా తెలుగు సాహిత్యంలోకి రావడం, చర్చించడం మంచి పరిణామం. రచయిత ఎంత నిష్ణాతులైనా, పాఠకులు లేనిదే ఆ రచనకు ప్రాణం ఉండదు. అందుకే పాఠకులు ఇచ్చే నిర్మాణాత్మక విమర్శ, ప్రశంస రచయితకు కొత్త శక్తినిచ్చి మెరుగైన అక్షరాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది.


- శాంతి ప్రబోధ