
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి
భూపరిశోధన పరీక్షలో ఎన్‌జిఆర్‌ఐ భాగస్వామ్యం కావాలి
ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాల్లో భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సర్వే నివేదికను
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేసిన ఎన్‌జిఆర్‌ఐ
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాల్లో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఎన్‌జిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ సచివాలయంలో అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్‌జిఆర్‌ఐ సంస్థను అభినందించడంతో పాటు ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి ఎన్‌జిఆర్‌ఐ ఆధ్వర్యంలో భూపరిశోధన (సాయిలు టెస్ట్) భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈఎన్‌సి రమేష్ బాబు సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా, ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌జిఆర్‌ఐ రూపొందించిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఎన్‌జిఆర్‌ఐతో సమగ్రంగా సర్వే నిర్వహినట్లు ఆయన తెలిపారు.
వేగవంతంగా ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ పనులు
తవ్వకాల సమయంలో ముందస్తుగా ప్రమాదవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వివరించారు. సొరంగ మార్గం తవ్వకాల్లో కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకుందన్నారు. అందుకు తగినట్లుగానే ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్‌జిఆర్‌ఐ రూపొందించిన నివేదికలో స్ట్రెస్‌జోన్‌లు, నీటి ఊరటలతో పాటు సొరంగమార్గం పై భాగం తదితర అంశాలపై ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం జరిపారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి పనుల పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్ల తోడ్పాటుతో ఇప్పటివరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. దేశీయ, అంతర్జాతీయంగా సంస్థల నుంచి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి రెండువైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.










