
రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని...వలలో వేసుకున్న నిందితులు బాధిత బాలికలను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 25 మందికి పైగా యువతులు ఈ నిందితుల చెరకు చెక్కి విలవిలలాడుతున్నట్లు తెలిసింది. బాధిత బాలికలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన సోదరులు అర్జున్, రాజీవ్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నాలుగు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితులైన సోదరులతో పాటు వారి తల్లి, మేనమామలను కూడా ఈ కేసులో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ఓ బాధిత బాలిక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. తమ కూతురును వదిలిపెట్టాలని బాలిక తల్లిదండ్రులు కన్నీటితో విన్నవించగా, మా అబ్బాయి...మీ అమ్మాయి జోలికి రాకుండా ఉండాలంటే రూ.25 లక్షలు ఇవాల్సిందేనని అర్జున్ తల్లి,మేనమామలు కూడా బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
అప్పటికే వారినుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో నిందితుల వేధింపులు తట్టుకోలేకే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో తవ్వినకొద్దీ ఒక్కో దారుణం వెలుగులోకి వస్తోంది. నిందితులు మైనర్లను బ్లాక్మెయిల్ చేసి లక్షలాది రూపాయల డబ్బు,బంగారం వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికలను మాయమాటలతో ముగ్గులోకి లాగి...అనంతరం పరిచయం తర్వాత బలవంతపు సంబంధాలకు దిగి వాటిని వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. అర్జున్‌తో పాటు రాజీవ్, వారి స్నేహితుల పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్లు తేలడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో బాధితులు ఇంకెంతమంది ఉన్నారన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.














