మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ ప్రధానంగా ఉద్యోగుల పిఆర్‌సి, డి.ఎ, ఆరోగ్య పథకం, బిల్లుల చెల్లింపు వంటి సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఆర్‌టిసి ఉద్యోగుల పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై సమావేశంలో చర్చించి, స్పష్టత ఇస్తారని సమాచారం. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. గోదావరి పుష్కరాలు, జనగణన వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.